సుద్ద అక్రమ తవ్వకాలకు చెక్
ధారూరు: సుద్ద అక్రమ తవ్వకాలపై శనివారం సాక్షి దినపత్రికలో ‘రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు స్పందించారు. ధారూరు మండలం తరిగోపుల పరిధిలోని సుద్ద గనుల్లో కొనసాగుతున్న అక్రమ తవ్వకాలను సర్పంచ్ బీ అంజిలయ్య, గ్రామస్థులు, స్థానికులు శనివారం అడ్డుకున్నారు. అనుమతి లేకుండా మైనింగ్ ఎలా చేస్తారని క్వారీ యజమానులను నిలదీశారు. దీంతో వందల సంఖ్యలో లారీలు ఆగిపోయాయి. సుద్ద తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని వ్యాపారులకు తేల్చిచెప్పారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. లీజు పత్రాలను పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని సర్పంచ్ ఆదేశించారు. లీజు పొందిన ప్రాంతంలోనే సుద్ద తవ్వకాలను చేపట్టాలని, మరో చోటతవ్వకాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ మైనింగ్ జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండి పడ్డారు.
సుద్ద అక్రమ తవ్వకాలకు చెక్


