దళితులపై దాడులు అమానుషం
దోమ: దేశంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, అరికట్టాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ అన్నారు. శనివారం దోమ మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల శ్రేయస్సు కోసం ఎమ్మార్పీఎస్ ఎప్పటి నుంచో ఉద్యమిస్తోందన్నారు. ఇటీవల కాలంలో దళితులపై దాడులు, వివక్ష, ప్రేమ హత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నివారణకు మరో ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కోదాడలో కర్ల రాజేశ్ అనే దళితుడిని ఎలాంటి ఎఫ్‌ఐఆర్ లేకుండా పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేసి లాకప్ డెత్‌గా చిత్రీకరించారని ఆరోపించారు. అతని మరణానికి కారణమైన ఎస్‌ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై డీజీపీకి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణమాదిగ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవన్నారు.కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బందెయ్య మాదిగ, ఉపాధ్యక్షుడు బొంపల్లి వెంకటేశ్ మాదిగ, నేతలు కిష్టయ్య మాదిగ, నర్సింహులు మాదిగ, శ్రీనివాస్ మాదిగ, మొగులయ్య మాదిగ పాల్గొన్నారు.


