‘సహకారం’ కుదింపు
రంగారెడ్డి జిల్లా: మాల్(యాచారం), అమీర్‌పేట్ (మహేశ్వరం), హైతాబాద్ (షాబాద్).
మేడ్చల్ జిల్లా: ముడిచింతలపల్లి (శామీర్‌పేట్).
వికారాబాద్ జిల్లా: లక్ష్మీనారాయణపూర్ (యాలాల), కాశీంపూర్ (బషీరాబాద్), అంగడి చిట్టంపల్లి (పూడూరు), చౌడాపూర్(కుల్కచర్ల),కోట్‌పల్లి(బంట్వారం), నాగారం (ధారూరు).
యాచారం: ఉమ్మడి జిల్లాలో కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఏర్పాటును సర్కార్ కుదించింది. డీసీసీబీ పరిధిలో ప్రస్తుతం 56 పీఏసీఎస్‌లు ఉన్నాయి. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మరో 20కి పైగా కొత్తవి ఏర్పాటు చేసేందుకు బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సహకార శాఖ ఉన్నతాధికారులు ఆయా మండలాల్లో పర్యటించి 25కు పైగా పంచాయతీలున్న మండలాల్లో ఒకటి చొప్పున మాత్రమే పీఏసీఎస్‌లు ఉన్నట్లు గుర్తించారు. మారుమూల గ్రామాల నుంచి మండల కేంద్రాల్లో ఉన్న వాటికి రైతులు రావడానికి ఇష్టపడకపోగా, సమీపంలోనే ఉన్న ఎస్‌బీఐ, యూనియన్ తదితర బ్యాంకుల్లో సేవలు పొందేవారు. పీఏసీఎస్‌ల సేవలను ప్రతి రైతుకు అందజేయాలనే ఉద్దేశంతో పెద్ద మండలాల్లో రెండు చొప్పున ఏర్పాటుకు నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పాటుకు ఆసక్తి చూపించ లేదు.
కొత్తగా పదింటికే సర్కార్ మొగ్గు
ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్‌ల్లో నాలుగు లక్షలకు పైగా రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఏటా డీసీసీబీ ద్వారా రూ.3వేల కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయి. పౌల్ట్రీ, డెయిరీఫాం, మేకల, గొర్రెల పెంపకానికి రైతులకు రూ.కోట్లలో రుణాలు అందజేస్తున్నారు. కొన్నేళ్లుగా పీఏసీఎస్‌ల ద్వారానే రైతులకు యూరియాతో పాటు ఇతర ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నారు. ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్ల విక్రయాలతో మంచి ఆదాయమే వస్తోంది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు తదితర నియోజకవర్గాల్లో కొత్తగా పీఏసీఎస్‌ల ఏర్పాటుకు అవకాశాలున్నా పది మాత్రమే ఏర్పాటు చేసేందుకు సర్కార్ నిర్ణయించినట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ ద్వారా సర్కార్‌కు ప్రతిపాదనల ఫైలు వెళ్లింది. త్వరలో గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
కొత్తవాటికి ఫ్యూచర్‌సిటీ గ్రహణం
జిల్లాలో కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ఫ్యూచర్‌సిటీ అడ్డుగా మారింది. ప్రస్తుతం 37 ఉండగా బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో కొత్తగా మరో 15 ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. యాచారం, కందుకూరు, మహేశ్వరం, మంచాల, ఆమనగల్లు, కడ్తాల్, చౌదరిగూడెం, షాద్‌నగర్ మొయినాబాద్, తలకొండపల్లి, కొత్తురు, కేశంపేట తదితర మండలాల్లో కొత్తవాటికి అవకాశాలు ఉండగా, ప్రస్తుతం ఆయా మండలాలను కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్‌సిటీలో భాగస్వామ్యం చేసింది. ఈ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో అసైన్డ్, ప్రభుత్వ భూములతో పాటు పట్టా భూములను సేకరించే అవకాశాలు ఉండడంతో కొత్తవి ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండదని భావిస్తోంది.
పదవులపై ఆశలు..
సహకార సంఘాలను రద్దు చేసిన ప్రభుత్వం మళ్లీ ఎన్నికల నిర్వహించాలా.. లేదంటే నామినేటెడ్ కింద పదవులను ఎంపిక చేయాలా అనే నిర్ణయాన్ని ప్రకటించలేదు. రద్దు చేసిన వెంటనే సహకార శాఖ అధికారులను పీఏసీఎస్‌లకు ఇన్‌చార్జిలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహించినా.. నామినేటెడ్ అయినా పదవులు ఖాయమనే భరోసాతో ఆశావహులు ఉన్నా రు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ప్రస న్నం చేసుకునే పనిలో మునిగినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో ఏర్పాటయ్యే కొత్త పీఏసీఎస్‌లు
రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా..
రేవంత్‌రెడ్డి సర్కార్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సహకార సంఘాలపై నిర్ణయం తీసుకుంటుంది. పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించాలా.. లేదా నామినేటేడ్ పద్ధతిలో డైరెక్టర్లు, చైర్మన్లను ప్రకటించాలా అనే విషయమై త్వరలో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.
– కొత్తకుర్మ సత్తయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్
‘సహకారం’ కుదింపు


