వడివడిగా అడుగులు
బీఆర్‌ఎస్‌లో అభ్యర్థుల వేట
తాండూరు: మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఇప్పటికే ఓటరు జాబితాను సిద్ధం చేసి మున్సిపల్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో, గ్రంథాలయ ఆవరణలో ప్రదర్శించారు. వార్డుల విభజనలో ఎలాంటి మార్పులు లేవు. ఓటరు జాబితాలో అభ్యంతరాలను స్వీకరించి మార్పులు చేర్పుల అనంతరం ఈ నెల 10న తుది జాబితాను ప్రకటిస్తారు. తాండూరు పట్టణ పరిధిలో ఓసీ, బీసీ సామాజిక వర్గం ప్రజలు అధికంగా ఉండటంతో వార్డుల రిజర్వేషన్లలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని రాజకీయ పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఒక వార్డు ఎస్టీ సామాజిక వర్గానికి, రెండు వార్డులు ఎస్సీలకు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహులంతా నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మున్సిపల్ చైర్మన్ సీటుకు రిజర్వేషన్ ఖరారు కాకముందే పోటీకి పలువురు సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్‌లో కొత్త లొల్లి
మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. రెండేళ్ల క్రితం వరకు పార్టీ వ్యవహారాలన్నీ రమేష్ మహరాజ్ ఆధ్వర్యంలో కొనసాగేవి.. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా ఉన్నారు. దీంతో స్థానిక రాజకీయాలపై దృష్టి పెట్టడంలేదు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నీ తానే చూసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్ వీడి తన కేడర్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.. బలమైన నాయకులంతా ఆయన వెంటే నడిచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్సెస్ మండలి చీఫ్‌విప్‌గా మారింది. పురపోరులో ఎవరికి వారు అనుచర గణానికే టికెట్లు ఇప్పించి గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే తన వెంట నడిచిన వారికి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా ఎన్నికల బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో పోటీ చేసి ఓటమి పాలైన వారు కూడా తమకే అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఎమ్మెల్యే సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులకు టికెట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
పురపోరుకుప్రభుత్వ సన్నాహాలు
నాయకుల చుట్టూ ఆశావహుల చక్కర్లు
రిజర్వేషన్లు ఖరారు కాక ముందే ముమ్మర ప్రయత్నాలు
కాంగ్రెస్ పార్టీలో ఇరువర్గాల మధ్య తీవ్ర పోటీ
బీఆర్‌ఎస్‌లో గెలుపు గుర్రాల కోసం వేట
తాండూరు మున్సిపల్ పరిధిలో బీఆర్‌ఎస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. సీనియర్ నేతలు, మాజీ చైర్మన్లు, కొంతమంది కౌన్సిలర్లు పార్టీ మారడంతో కొంత డీలా పడింది. మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో గెలుపు గుర్రాల కోసం వేట మొదలు పెట్టారు. ఇప్పటికే వార్డుల వారీగా బలమైన సామాజిక వర్గాల నాయకులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు దక్కని వారిని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకువాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో వర్గపోరు కారణంగా పట్లోళ్ల దీప నర్సింహులు దంపతులు చైర్మన్ పదవికి దూరమయ్యారు. ఈ సారి ఎలాగైనా చైర్మన్ పదవి తమ ఖాతాలో వేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
వడివడిగా అడుగులు


