ఆలయ విస్తరణ పనులు షురూ
● గుడి చుట్టూ ఉన్న నిర్మాణాల కూల్చివేత
● రూ.110 కోట్లతో అభివృద్ధి
● వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పనులు
కొడంగల్: పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను శుక్రవారం ప్రారంభించారు. గుడి చుట్టూ ఉన్న నిర్మాణాలను రెండు జేసీబీల సాయంతో కూల్చి వేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ ఈ పనులను దగ్గరుండి పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోకంగా నిర్మాణ పనులు చేయనున్నారు. ఇందుకోసం రూ.110 కోట్లు మంజూరు చేశారు. తెలంగాణ దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు, వాస్తు నిపుణులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆలయాన్ని విస్తరించి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. క్యూ లైన్, కల్యాణ మంటపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గృహాలు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మిస్తారు. శ్రీవారి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తుల ఊరేగింపు కోసం మాఢ వీధులను ఏర్పాటు చేస్తారు. ఆలయం చుట్టూ ఉన్న 8,736 గజాల ప్రైవేటు స్థలాన్ని సేకరించారు. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రత్యేక ప్యాకేజీతో పరిహారం చెల్లించారు.


