తెగతాగేశారు.. | - | Sakshi
Sakshi News home page

తెగతాగేశారు..

Jan 3 2026 8:40 AM | Updated on Jan 3 2026 8:40 AM

తెగతాగేశారు..

తెగతాగేశారు..

వికారాబాద్‌: పూడూరు మండలంలో ఆరు వందల ఓటర్లున్న ఓ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేలా జరిగాయి. ఆ జీపీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు కేటాయించారు. ఇద్దరు పోటీ పడ్డారు. మద్యం, నగదు పంపకాల్లో ఒక్కో అభ్యర్థి రూ.కోటి వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. వార్డు సభ్యులు సైతం ఒక్కొక్కరు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. సర్పంచ్‌ అభ్యర్థి ఒక్కో ఓటుకు రూ.10,500, మరో అభ్యర్థి రూ.11,000 పంచినట్లు తెలిసింది. గ్రామంలోని పెద్ద మనుషులకు అదనం. డబ్బులిచ్చి వలస ఓటర్లను గ్రామానికి రప్పించారు. ఓ కుటుంబానికి చెందిన 11మంది ఓటర్లు పూణేలో ఉండగా ఒక్కొక్కరికి రూ.15వేలు ఇచ్చి గ్రామానికి రప్పించడం గమనార్హం. మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి అభ్యర్థితో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

నవాబుపేట మండలంలో..

నవాబుపేట మండలంలో 1,800 మంది ఓటర్లున్న ఓ గ్రామం బీసీ మహిళకు రిజర్వ్‌ అయ్యింది. ముగ్గురు నాయకులు వారివారి భార్యలను రంగంలోకి దింపగా మరో యువకుడు తన తల్లిని పోటీలో ఉంచారు. ముగ్గురు అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల చొప్పున పంచగా మరో అభ్యర్థి రూ.2,500 ఇచ్చినట్లు తెలిసింది. ఒక్కో సర్పంచ్‌ అభ్యర్థి రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పంచాయతీ పరిధిలో 10 వార్డులు ఉండగా 25 మంది పోటీ పడ్డారు. ఒక్కొ అభ్యర్థి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.

రెండు కేసులు.. రూ.3.75 లక్షలు సీజ్‌

జిల్లాలో 594 గ్రామ పంచాయతీలు ఉండగా 75 జీపీలు, 5,058 వార్డులకు గాను 1,252 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 519 జీపీలు, 3,806 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో సర్పంచ్‌ అభ్యర్థులు 1,933 మంది, వార్డు అభ్యర్థులుగా 10,055 మంది పోటీ పడ్డారు. ఏకగ్రీవ పంచాయతీల్లో సైతం చాలా వరకు డబ్బులు వెచ్చించే సర్పంచులు, వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. యాలాల మండలంలో ఏకగ్రీవం అయిన ఓ చిన్న తండాలో రూ.21 లక్షల గ్రామానికి ఇవ్వాలనే ఒప్పందంతోనే సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఇలా మొత్తం జిల్లాలో సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలుపొందేందుకు అభ్యర్థులు రూ.300 కోట్ల నుంచి రూ.350 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇంత పెద్దమొత్తంలో జీపీ ఎన్నికల్లో ధన ప్రవాహం సృష్టించగా పోలీసులు మాత్రం రెండు కేసులు నమోదు చేసి రూ.3.75 లక్షలు సీజ్‌ చేసి చేతులు దులుపుకొన్నారు. అయితే సర్పంచ్‌ అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి చూసిచూడనట్టు వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి.

ఏరులై పారిన మద్యం

ఎన్నికల కోడ్‌ వెలువడింది మొదలు కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు డిసెంబర్‌ మొదటి రెండు వారాల్లో మద్యం ఏరులై పారింది. నవంబర్‌తో పాత మద్యం పాలసీ ముగియగా డిసెంబర్‌ ఒకటవ తేదీ నుంచి నూతన వైన్స్‌ ప్రారంభమయ్యాయి. రెండో తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభించారు. డిసెంబర్‌ నెల చివరి నాటికి రూ.72 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ నెల మొదటి 15 రోజుల్లో రూ.53 కోట్ల పైచిలుకు అమ్మకాలు జరిగాయి. సాధారణంగా జిల్లాలో సగటున నెలకు రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు మద్యం విక్రయిస్తారు.

గత నెలలో రూ.72 కోట్లవైన్‌ అమ్మకాలు

పంచాయతీ ఎన్నికల వేళ

ఏరులై పారిన మద్యం

అదే తరహాలో డబ్బు పంపిణీ

పలు జీపీల్లో ఒక్కో సర్పంచ్‌ అభ్యర్థి రూ.కోటి వరకు ఖర్చు!

వార్డు సభ్యుల ఖర్చూ

రూ.4 లక్షల పైమాటే..

చూసీచూడనట్లుగా పోలీసు, ఎకై ్సజ్‌ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement