అడ్డగోలు హామీలతో మోసం
● ‘పాలమూరు’ పూర్తి చేసి సాగునీరందించాలి
● మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
దుద్యాల్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేశారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండలంలోని గౌరారం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే సీఎం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి చూపించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ 2015లో రూ.37 వేల కోట్లతో ప్రాజెక్ట్ పనులు చేపట్టారని గుర్తు చేశారు. రూ.27 వేల కోట్లు వెచ్చించి 70 శాతానికి పైగా పనులను పూర్తి చేశారని పేర్కొన్నారు. మిగిలిన పనులు ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరందించడం కష్టమన్నారు. అభివృద్ధి చేసినందుకే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావ్‌లను ఉరి తీయాలా అని ప్రశ్నించారు. కొట్లాడి రాష్ట్రం తెచ్చిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో దుద్యాల్, బొంరాస్‌పేట్, మద్దూరు మండలాల అధ్యక్షులు చాంద్‌పాషా, యాదగిరి, గోపాల్, దౌల్తాబాద్ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్, నాయకులు నారాయణ రెడ్డి, నరేశ్ గౌడ్, శ్రీనివాస్, సాయిలు, జనార్దన్‌రెడ్డి, వెంకట్ నర్సింహ, శివకుమార్, నరేశ్, మహేందర్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.


