రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
ధారూరు: సుద్ద తవ్వకాలపై రెవెన్యూ, మైనింగ్ అధికారుల నుంచి గోరంత అనుమతులు పొందిన వ్యాపారులు కొండంత తవ్వుతూ రూ.కోట్లు గడిస్తున్నారు. వేలాది టన్నుల సుద్దను అక్రమంగా తవ్వి వందలాది లారీల్లో తరలిస్తూ ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారని అధికార పార్టీ నాయకులు మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఇందుకు స్పందించిన తాండూరు మైనింగ్ ఆర్‌ఐ నిర్మల, ఏజీ, సిబ్బంది తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టారు.
పట్టా పొలాల్లో అనుమతులు.. అసైన్డ్ భూముల్లో తవ్వకాలు
మండల పరిధిలోని తరిగోపుల పొలాల్లో సుద్ద తవ్వుకునేందుకు 12 మందికి, నాగ్‌సాన్‌పల్లిలో ఇద్దరికి, అల్లిపూర్‌లో ఒకరికి మైనింగ్ అనుమతులు ఇచ్చారు. తరిగోపుల సర్వే నంబర్ 384లో 200 ఎకరాలు అసైన్డ్ భూములుండగా అందులో వంద ఎకరాలు ఆర్మీకి అప్పగించారు. మిగిలిన వంద ఎకరాల్లో కొందరు సేద్యం చేస్తుండగా ఎక్కువ మంది రైతులు సుద్ద వ్యాపారులకు విక్రయించారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వ్యాపారులు రైతులకున్న పట్టా భూముల పేరిట అనుమతులు తీసుకుని తవ్వకాలుచేపడుతున్నారు.
సమాచారం ఇచ్చి.. తనిఖీలకు వచ్చి!
తనిఖీలకు వచ్చే అధికారులు ముందస్తుగా వ్యాపారస్తులకు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ ఆర్‌ఐ నిర్మల, సిబ్బంది అనుమతి ఉన్న మైనింగ్‌ను తనిఖీ చేసి మమ అనిపించారు. దీంతో అక్కడున్న విలేకరులు ప్రశ్నించగా ఎక్కడ జరుగుతుందో మీరే చూపండి.. మేం చర్యలు తీసుకుంటామంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాగా కొంచెం ముందుకు వెళ్తే అక్రమాలు బయటకు వస్తాయి అని చెప్పగా.. చర్యలు తీసుకునే బాధ్యత రెవెన్యూ అధికారులదే అంటూ ఆర్‌ఐ సమాధానం ఇచ్చారు. దీంతో లీజు తీసుకున్న భూమిలో కాకుండా అసైన్డ్ భూముల్లో మైనింగ్ చేపడితే చూస్తూ ఊరుకుంటారా? అక్రమ మైనింగ్‌పై డబ్బులు తీసుకుంటూ ప్రోత్సహిస్తున్నారంటూ అధికార పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారుకదా అని ప్రశ్నించారు. దీంతో ఆమె మీరేం రాసుకుంటారో రాసుకోండి. మాకేం అభ్యతరం లేదు. ఎవరేం ఆరోపించినా పట్టించుకోలేం. అన్ని చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఐదెకరాల్లో తవ్వకాలు చేపట్టారని.. ఇక్కడ వేల టన్నుల్లో సుద్ద నిల్వలున్నాయని సమాధానం చెప్పాలంటూ విలేకరులు పట్టుబట్టడంతో పొలాల్లో ఆరెబెట్టుకున్న దానికి సంబంధం లేదని.. మైనింగ్ స్థలంలో సుద్ద లేదంటూ దాటవేశారు. ఇక్కడ వందల సంఖ్యలో లారీలున్నాయి. రాయల్టీ వసూలు చేస్తున్నారా? రూ.కోట్లు ఎగ్గొడుతూ అక్రమంగా తరలిస్తుంటే పట్టించుకోరా అని ప్రశ్నించగా మౌనమే సమాధానం అయింది. పదేపదే పశ్నించడంతో జాయింట్ సర్వే చేసి తేలుస్తాంటూ ముక్తసరిగా చెప్పడంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు మహ్మద్‌ఖాన్, ఇబ్రాహీం, అశోక్, టి.మల్లేశం తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
హిటాచీలు, జేసీబీలు మాయం
అక్రమంగా మైనింగ్ చేస్తున్న సుద్ద గనుల్లో శుక్రవారం హిటాచీలు, జేసీబీలు కన్పించలేవు. కేవలం సుద్ద తరలించే లారీలు, టిప్పర్లు మాత్రం వందల సంఖ్యలో ఉన్నాయి. మైనింగ్ అధికారుల రాకను గమనించిన టిప్పర్లు గనుల్లోనుంచి సుద్దను వదిలేసి వెళ్లాయి.
తరిగోపుల 384 సర్వేనంబర్ సుద్ద గనిలో మైనింగ్ అధికారుల తనిఖీలు
సుద్ద నిల్వలు
అనుమతులు గోరంత.. తవ్వేది కొండంత
రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి
తనిఖీలు చేపట్టిన మైనింగ్ అధికారులు
విలేకరుల ప్రశ్నలకు సమాధానం దాటవేత
రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా


