మల్‌రెడ్డి ధిక్కార స్వరం!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు. అసెంబ్లీ సాక్షిగా శుక్రవారం అధికార పార్టీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. మున్సిపాలిటీల విలీనంతో జిల్లా అస్తిత్వం, స్వభావం పూర్తిగా దెబ్బతిందదని, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో తాము ప్రజల్లో తిరగలేకపోతున్నామని, వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి దాపురించిందని ఎండగడుతూ రాజకీయ దుమారానికి తెరతీశారు. ఆయన ఆవేదనకు కేబినెట్‌లో తనకు అవకాశం ఇవ్వలేదనే అసంతృప్తా లేక.. క్షేత్రస్థాయిలో తలెత్తిన పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నమా అన్న అంశాలపై కూడా చర్చ సాగుతోంది. బీఆర్‌ఎస్ హయాంలో కేబినెట్‌లో ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురు మంత్రులు ఉండేవారు. హైదరాబాద్ నుంచి మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, ఉమ్మడి రంగారెడ్డి నుంచి పటోళ్ల సబితారెడ్డి, చామకూర మల్లారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి మంత్రులుగా పని చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓటమి పాలై.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రేవంత్‌రెడ్డి సీఎంగా, వికారాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన గడ్డం ప్రసాద్‌కుమార్ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు మంత్రి వర్గంలో ఎలాంటి ప్రాముఖ్యత లభించలేదు.
జిల్లాలో చర్చనీయాంశం
మొదటి విడత కేబినెట్ విస్తరణలోనే తనకు అవకాశం దక్కుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆశించారు. ఇప్పటికే మూడు విడతల్లో విస్తరణ జరిగినా చోటు దక్కలేదు. ఇందుకోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. గాంధీభవన్ సాక్షిగా ఇప్పటికే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. జిల్లా నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను సైతం కలిశారు. అయి నా ప్రయోజనం లేకపోయింది. దీంతో కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభు త్వం తాజాగా శివారులోని 27 మున్సిపాలిటీల ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం, 300 వార్డులు.. 12 జోన్లు.. 60 సర్కిళ్లను ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇప్పటికే మూడు ముక్కలైన జిల్లాను.. మళ్లీ మున్సిపాలిటీల విలీనం పేరుతో అస్తిత్వం లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. ఇక్కడి వాళ్లకు దిక్కూమొక్కు లే దు.. జవాబుదారీతనం లేదు.. వార్డుల విభజన శాసీ్త్రయంగా లేదు.. సరిహద్దులను, ఓటర్లను, విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకోలేదు.. ఇష్టం వచ్చినట్లు వార్డులు ప్రకటించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని అసెంబ్లీ వేదికగా ఆవేదన వ్యక్తం చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రజల్లో తిరగలేకపోతున్నాం.. ఏం సమాధానం చెప్పాలి
జిల్లా అస్థిత్వం, స్వభావాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వ నిర్ణయాలు
అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ


