అడ్డొచ్చిన మృత్యువు
మహేశ్వరం: రోడ్డుపై అడవి పంది అడ్డురావడంతో తప్పించబోయి ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరికీ తీవ్ర గాయాలయాయి. ఈ సంఘటన మండల పరిధిలోని ఆకన్‌పల్లి గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. పోరండ్ల గ్రామానికి చెందిన తేరటి శ్రీకాంత్(27), సంగెం గిరిబాబు అలియాస్ గిరీశ్(34), దయ్యాల శివ కలిసి తుక్కుగూడకు పని నిమిత్తం ఉదయం వెళ్లారు. గిరీశ్ టవేరా కారులో వెళ్తుండగా ఆకన్‌పల్లి గ్రామ సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా అడవి పంది అడ్డు రావడంతో తప్పించబోయారు. డ్రైవర్ గిరీశ్ సడన్ బ్రేక్ వేసి స్టిరింగ్‌ను కుడివైపునకు తిప్పడంతో కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్, గిరీశ్‌లకు బలమైన గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శివకు సైతం తీవ్ర గాయాలయాయి. విషయం తెలుసుకున్న మహేశ్వరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులకు తెలియజేశారు. గాయాలపాలైన శివను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోర్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. గిరీశ్‌కు ఇద్దరు కుమార్తెలు, ప్రస్తుతం భార్య గర్భంతో ఉంది. ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి గ్రామానికి చేరుకొని మృతదేహాలను నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు తమవంతు కృషి చేస్తామని ఆమె తెలిపారు. మాజీ ఎంపీపీ కోరుపోలు రఘుమారెడ్డి మృతదేహాలకు నివాళులర్పించారు.
● అడవి పందిని తప్పించబోయిపల్టీ కొట్టిన కారు
● అక్కడిక్కడే ఇద్దరి దుర్మరణం, ఒకరికి గాయాలు
అడ్డొచ్చిన మృత్యువు
అడ్డొచ్చిన మృత్యువు


