ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
ధారూరు: వికారాబాద్–తాండూరు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు టైర్ల నుంచి పొగలు వచ్చాయి. ప్రయాణికులు గమనించి గగ్గోలు పెట్టడంతో డ్రైవర్ బస్సు నిలిపివేశాడు. ప్రయాణికులు కిటికీలు, ఒకరిపై ఒకరు తోసుకుంటూ బస్సు దిగి ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం కేరెళ్లి బస్ స్టాప్ వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. టీజీ 34 జెడ్ 0089 నంబర్ ఆర్టీసీ బస్సు వికారాబాద్ నుంచి తాండూరుకు ప్రయాణిస్తున్న క్రమంలో అనంతగిరి గుట్టలు దిగుతుండగా ముందు టైర్ల నుంచి పొగలు ప్రారంభమయ్యాయి. గమనించని బస్సు డ్రైవర్ గౌస్ అలాగే కేరెళ్లి వరకు నడిపాడు. కేరెళ్లి బస్ స్టాప్‌లో ప్రయాణికులను ఎక్కించుకుని మరికొంత దూరం ప్రయాణించగానే దట్టమైన పొగలు వ్యాపించాయి. మహిళలు టైర్ల నుంచి పొగలు వస్తున్నాయంటూ అరవడంతో డ్రైవర్ బస్సు నిలిపివేశాడు. ఈ సమయంలో బస్సులో దాదాపు 140 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంకొంచెం దూరం అలాగే వెళ్తే పెను ప్రమాదం సంభవించేందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటం వలన బ్రేక్ వేసినప్పుడల్లా లోడ్ ఎక్కువై టైర్లకు పొగలు వ్యాపించాయని డ్రైవర్ వివరించారు. ప్రయాణికులను వేరే బస్సుల్లో ఎక్కించి డిపో మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు.
అనంతగిరి గట్టు దిగుతుండగా టైర్ల నుంచి పొగలు


