పుట్టిన రోజునే మృతి
● రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి
● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దుర్మరణం
● అయ్యప్ప మాలధారణలోనే అనంతలోకాలకు
● మల్కాపూర్‌లో విషాదం
తాండూరు రూరల్: అయ్యప్ప మాలధారణలో ఉన్న ఓ యువకుడు పుట్టిన రోజునే చనిపోయిన విషాద ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాజులపురం నర్సింహారెడ్డి, లావణ్య దంపతులకు ఇద్దరు కొడుకులు. వీరిలో పెద్ద కుమారుడు కౌశిక్‌రెడ్డి(20) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం నార్సింగి పీఎస్ పరిధిలోని ఆరె మైసమ్మ వద్ద బైక్‌పై వెళ్తూ ఆగి ఉన్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన అతన్ని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. సాయంత్రం స్థానిక శ్మశానవాటికలో నిర్వహించిన అంత్యక్రియల్లో బంధువులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చి అంతిమ వీడ్కోలు పలికారు. పుట్టిన రోజునే చనిపోవడంతో బాధిత తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇదిలా ఉండగా మృతుడి కళ్లను దానం చేశారు.


