ధాన్యం తూకంలో మోసం
● బస్తాకు మూడు కిలోలు అదనం
● నిర్వాహకుల ఇష్టారాజ్యం
● ఆందోళనలో రైతులు
ధారూరు: ధాన్యం విక్రయించేందుకు సోమవారం రైతులు గురుదోట్ల కొనుగోలు కేంద్రానికి వచ్చారు. ఒక్కో బస్తాను 40 కిలోల 600 గ్రాముల చొప్పున తూకం వేయాల్సిన నిర్వాహకులు.. ఏకంగా 43 కిలోల తూకం వేశారు. ఇదేమని ప్రశ్నించిన రైతులకు.. నిర్వాహాకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. మిల్లర్లకు నిర్ణీత బియ్యం రావటం లేదట. అదనంగా 3 కిలోల ధాన్యం ఇస్తేనే తీసుకుంటాం. లేదంటే లారీని వెనక్కి పంపిస్తా’ అని మిల్లర్లు చెబుతున్నారని అక్కడి ఇచ్‌చార్జి చెప్పారు. దీంతో ఏం చేయాలో తోచక.. మోసాన్ని చూస్తూ మౌనం వహించడం వారి వంతయింది. ఈ సందర్భంగా కొందరు అన్నదాతలు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో ఇలా అదనంగా తూకం వేస్తూ దగా చేస్తున్నారని వాపోయారు. మిల్లర్లతో కేంద్రం నిర్వాహకులు చేతులు కలిపి, మమ్మల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, మోసాన్ని అరికట్టాలని కోరుతున్నారు.


