ఆధ్యాత్మికం.. పర్యాటకం
తాండూరు: దివ్య క్షేత్రాలకు నిలయం తాండూరు ప్రాంతం. కాగ్నానది పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున శివాలయాలు వెలిశాయి. ఇవి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. పట్టణంలోని భావిగి భద్రేశ్వరాలయం, జుంటుపల్లిలోని రామచంద్రస్వామి దేవాలయం, నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో వెలిసిన రామలింగేశ్వరాలయం భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తున్నాయి. కర్ణాటక సరిహద్దులో ఉండే ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఇరు రాష్ట్రాల ప్రజలు, పర్యాటకులు ఉత్సాహం చూపుతుంటారు. బషీరాబాద్ మండలం నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో వెలసిన ఏకాంబర రామలింగేశ్వరాలయం అన్ని మతాల వారికి ఆదర్శంగా నిలిచి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతోంది. ఇక్కడి పుష్కరిణి మధ్యలో రామలింగేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. దీనికి పక్కనే యాకూబ్‌సాబ్ దర్గాలున్నాయి.


