గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని
నెక్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలస్వామి
అబ్దుల్లాపూర్‌మెట్: గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నెక్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలస్వామి పేర్కొన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ సేవలో డాక్టర్ బాలస్వామి 50 వసంతాల, స్వర్ణోత్సవ వేడుక సందర్భంగా పెద్దఅంబర్‌పేటలోని తెలంగాణ ఫౌల్ట్రీ ఫెడరేషన్ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలస్వామి మాట్లాడుతూ తల్లి పాల తర్వాత బలమైన ఆహారం గుడ్డు మాత్రమేనన్నారు. కంప్యూటర్ యుగంలో కల్తీ అనేది సర్వ సాధారణమైందన్నారు. కోడి గుడ్డును మాత్రం ఎవరు కల్తీ చేయలేరని స్పష్టం చేశారు. ప్రతీరోజు ఆహారంలో గుడ్డు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. కోడి గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటీస్, ఒబెసిటీ వంటి అనేక రకాల రోగాల బారిన పడకుండా ఉండొచ్చన్నారు. అనంతరం పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్లు పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను డాక్టర్ బాలస్వామి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర రావు, పౌల్ట్రీ ఇండియా మాజీ అధ్యక్షుడు చక్రధర్ రావు, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, నెక్ బిజినెస్ మేనేజర్ సంజీవ్ చింతావార్‌తో పాటు పౌల్ట్రీ రైతులు పాల్గొన్నారు.


