ఏడిపించిన ఎవుసం
యాసంగి ‘భరోసా’ ఏదీ?
నాగలి కంట కన్నీరు పెట్టింది.. అందరి ఆకలి తీర్చే రైతన్న పంట పండించేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. అతివృష్టి, అనావృష్టి కారణంగా సాగు సమరమైంది.
వికారాబాద్: ఈ ఏడాది ఎవుసం ఏడిపించింది.. తొలుత వర్షాలు సానుకూలంగా ఉండడంతో రైతులు ముందుగానే దుక్కులు సిద్ధం చేసుకున్నారు. వరుణుడు ముఖం చాటేయడంతో విత్తుకున్న విత్తనాలు మొలకెత్తక కన్నీరు పెట్టుకున్నారు. జూలై, ఆగస్టు మాసాల్లో కురిసిన అధిక వర్షాలు కర్షకుడిని తేరుకోనివ్వలేదు. 2025లో జిల్లాలో వ్యవసాయ రంగం పూర్తిగా ఒడిదుడుకులు ఎదుర్కొంది. నాలుగైదేళ్లుగా అతివృష్టి, అనావృష్టి సమస్యలతో సతమతమైన రైతుకు ఈ ఏడాది సైతం గత అనుభవాలే ఎదురయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, వానాకాలం ఆరంభం నుంచి వరుణుడు విరుచుకుపడటంతో నష్టాలపాలయ్యారు. మర్పల్లి, మోమిన్‌పేట, వికారాబాద్, నవాబుపేట, పరిగి, దోమ, ధారూరు, బొంరాస్‌పేట, యాలాల, దౌల్తాబాద్ తదితర మండలాల్లో పంటలు చేతికందకుండా పోయాయి. జిల్లాలో ప్రధాన పంటలైన పత్తి, మొక్కజొన్న, కంది, వరి పంటల దిగుబడులు పూర్తిగా తగ్గాయి. గత యాసంగి సీజన్‌లో కొనుగోళ్లలో తలెత్తిన ఇబ్బందులు రైతును కుదేలయ్యేలా చేసింది. కొనుగోలు కేంద్రాల్లో నిర్వహకుల కొర్రీలతో పండించిన పంటలో 50 శాతం దళారులకే విక్రయించాల్సి వచ్చింది.
రుణమాఫీకి ఎదురుచూపులు
సగం మంది రైతులకు రుణమాఫీకాగా మిగిలిన వారికి ఎదురు చూపులు తప్పడం లేదు. రుణమాఫీ పథకం ద్వారా జిల్లాలో మూడు విడతల్లో కలిపి సగం మంది రైతులే రుణ విముక్తులయ్యారు. జిల్లాలో 2.50లక్షల మంది రైతులు 5.90లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. గతేడాది (2023–24) 1,78,522 మంది రైతులు పలు బ్యాంకుల నుంచి రూ.2,582 పంట రుణాలు తీసుకున్నారు. రుణమాఫీలో ప్రభుత్వం కుటుంబాన్ని యూనిట్‌గా స్వీకరించడంతో మూడు విడతల్లో 91,956 మంది రైతులకు రూ.865 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. రూ.2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు ముందుగా రూ.2 లక్షల పైన ఉన్న బకాయి బ్యాంకుల్లో నగదు జమ చేస్తే రుణ మాఫీ చేస్తామని ప్రకటించింది. తీరా నగదు జమచేసిన తర్వాత ప్రభుత్వం చేతులెత్తేసింది.
అధిక వర్షాలతో ఆగం
విత్తనాలు విత్తుకుంది మొదలు మొక్కజొన్న రైతుకు గడ్డు పరిస్థితి ఎదురైంది. వర్షాలు ఆలస్యంగా కురిసి విత్తనాలు పాడయ్యాయి. పలు చోట్ల రెండుసార్లు విత్తనాలు విత్తుకోవాల్సి వచ్చింది. జూలై, ఆగస్టు మాసాల్లో కురిసిన అఽధిక వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి రైతుకు సైతం కష్టాలు తప్పలేదు. జిల్లాలోని 20 మండలాల్లో 1,45,000 మంది కర్షకులు 2.60లక్షల ఎకరాల్లో తెల్లబంగారం సాగు చేపట్టారు. ఎకరాకు 10 నుంచి 16 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా.. అధిక వర్షాల కారణంగా నాలుగు నుంచి ఆరు క్వింటాళ్లకే పరిమితమైంది. పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కూరగాయ పంటలకూ నష్టం
వానాకాలం సీజన్‌లో 25వేల ఎకరాల్లో కూరగాయ పంటలు సాగు చేశారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో కాపునకు వచ్చిన టమాటా, క్యారెట్, బీట్‌రూట్ పంటలు అధిక వర్షాలు, వడగళ్లు కడగల్లు మిగిల్చాయి. ధరలు పెరగడంతో వినియోగదారుడు సైతం కొనలేక తినలేక ఇబ్బందులు పడుతున్నారు. పూల తోటలు సైతం పాడై రైతులు నష్టపోయారు. పాడైన పంటలకు ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం సైతం ఇవ్వడం లేదు.
ఆయిల్‌పామ్ సాగుకు ఆసక్తి
ఈ ఏడాది ఆయిల్‌పామ్ సాగు దిశగా రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 50వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగుచేస్తున్నారు. ఆయిల్ పామ్ ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం జిల్లాల వారీగా లక్ష్యాలను విధించింది. 35,000 ఎకరాల నేలలు అనుకూలంగా ఉన్నట్లు ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఏడాది జిల్లాలో కనీసం 2వేల ఎకరాల్లో పంట సాగు చేసేలా రైతుల ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధేశించింది. వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యాన్ని చేరుకున్నారు.
వానాకాలం నుంచే రైతుకు సాగు కష్టాలు
వర్షాలకు పంట నష్టపోయిన కర్షకులు
పరిహారం అందించని సర్కార్
యాసంగి సాగుకు అందని రైతు భరోసా
తుఫాన్ల కారణంగా వేల ఎకరాల్లో పంటలు నష్టం వాటిళ్లడంతో 1,350 మంది రైతులు 1,500 ఎకరాలు నష్టపోగా ప్రభుత్వం ఎటువంటి పరహారం అందలేదు. ప్రతీ ఏడాది జిల్లాలో రూ.320 కోట్ల వరకు రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ చేసేది. ప్రస్తుత ప్రభుత్వం ఎకరాకు రూ.12వేల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చింది. కాగా వానాకాలం పంటకు పెట్టుబడి సాయం అందగా.. యాసంగికి సంబంధించి ఇప్పటి వరకు నగదు జమకాలేదు.
ఏడిపించిన ఎవుసం


