ఏకగ్రీవాలకు నై!
రంగంలోకి ఎమ్మెల్యేలు
పోటీకి సై..
పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రెండు విడతల నామినేషన్లు పూర్తవడంతో ఎన్నికల వేడి రాజుకుంది. బరిలో ఉన్నవారిని తప్పించేందుకు శరవేగంగా పావులు కదుపుతున్నారు. విత్‌డ్రా అయితే పరువుపోతుందని ఒకరు.. తప్పుకొంటే భవిష్యత్‌లో మంచి పొజిషన్‌లో ఉంటావంటూ బుజ్జగింపులు కొనసాగుతున్నాయి.
వికారాబాద్: పంచాయతీ ఎన్నికల్లో తొలి రెండు విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం పూర్తయింది. మొదటి విడతలో ఎనిమిది మండలాల పరిధిలో 262 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా సర్పంచ్ స్థానాలకు 1,384 నామినేషన్లు దాఖలయ్యాయి. 2,198 వార్డు స్థానాలకు 4,379 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఇప్పటికే 18 పంచాయతీలు ఏకగ్రీవం అవగా నేటి ఉపసంహరణలతో సంఖ్య పెరిగే అవకాశం ఉండనుందని పలువురు చర్చించుకుంటున్నారు. సాధ్యమైనంతగా పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలని అధికార పార్టీ పెద్దలు సూచించడంతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలో ఏకగ్రీవం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో వారు పోటీకే సై అంటున్నారు.
నేడు రెండో విడత స్క్రూటినీ
రెండో విడతలో 175 పంచాయతీలకు మంగళవారంతో నామినేషన్ల గడువుగా ముగియగా బుధవారం వీటిని పరిశీలించనున్నారు. 6వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంది. అదే రోజు తుదిజాబితా ప్రకటించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సైతం నేటితో ముగియనుండటంతో అభ్యర్థులు ఇక పూర్తిస్థాయిలో ప్రచారానికి తెరలేవనుంది. మహిళా రిజర్వేషన్లు ఉన్న చోట ఆశావహులు తమ సతులను పోటీకి దించుతున్నారు.
జనరల్ స్థానాల్లో పోటీ అనివార్యం
2019లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా పాలక వర్గాల పదవీ కాలం ముగిసి రెండేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఆశావహుల సంఖ్య పెరిగింది. వార్డులకు పోటీ తక్కువగానే కనిపిస్తుంది. మొదటి విడత జీపీల్లో ఒకటి నిష్పత్తి రెండు నామినేషన్లు అంటే ఒక వార్డు స్థానానికి సగటున ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ పదవులకు పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఒక సర్పంచ్ స్థానానికి ఇద్దరు నుంచి ఐదుగరు చొప్పున పోటీలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా హస్తగతమవడంతో ఆ ప్రభావం ఈ ఎన్నికలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఏకగ్రీవాల్లో మెజార్టీ అధికార పార్టీ మద్దతుదారులే కావడం గమనార్హం. జిల్లాలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామనగా కోర్టు తీర్పుతో కొంత గందరగోళ పరిస్థితి తలెత్తినపట్పికీ పార్టీలు దాని నుంచి తేరుకుని పోటీకి సై అంటున్నాయి. వంద శాతం ఎస్టీ రిజర్వుడు తండాలు, చిన్న పంచాయతీల్లోనే ప్రజలు ఏకగ్రీవ చర్చలు జరుపుతున్నా.. జనరల్ స్థానాలలో మాత్రం పోటీ అనివార్యంగా కనిపిస్తోంది.
ముగిసిన రెండు విడతల నామినేషన్లు
నేటి నుంచి మూడోవిడత
యునానిమస్ చేసేందుకు ఎమ్మెల్యేల యత్నం
ససేమిరా అంటున్న ఆశావహులు
జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రం
మొదటి విడతలో తాండూరు సెగ్మెంట్‌లోని నాలుగు మండలాలు, కొడంగల్‌లోని నాలుగు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. సాధ్యమైనంతవరకు పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అధికంగా చేయాలని ఆపార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేయడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న సెగ్మెంట్లతో పాటు వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు సైతం పార్టీ సానుభూతిపరులను సర్పంచులుగా ఏకగ్రీవం చేసేందుకు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. నియోజకవర్గ, మండల కేంద్రానికి ముఖ్య నాయకులను, గ్రామ పెద్దలను పిలిచి చర్చలు జరుపుతున్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు వారి ఆలోచనలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పోటీ అనివార్యమైతే తమ పార్టీ సానుభూతిపరులను గెలిపించుకునేందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ప్రారంభించారు. జనరల్, బీసీ స్థానాలలో ఏకగ్రీవ ప్రయత్నాలు ఫలించిన దాఖలాలు కనిపించడం లేదు. చాలా ఏళ్ల తరువాత తమ కేటగిరీకి రిజర్వేషన్ వచ్చిందని, పోటీకి చేస్తామంటున్న తమకు ఏకగ్రీవాల పేరుతో అడ్డుకోవద్దని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఆశావహులు వేడుకుంటున్నారు. కొన్ని గ్రామాలలో అధికారపార్టీ నుంచే ఇద్దరు నుంచి ఐదుగురు వరకు నామినేషన్లు వేస్తున్నారు. వారికి సర్ధిచెప్పేందుకు ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ఎవరిని వద్దనాలో.. ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం ఎన్నికల్లో ఆ లోటు కనిపిస్తుంది.


