అవగాహనతోనే సైబర్ నేరాలకు చెక్
అనంతగిరి: సైబర్ నేరాలపై ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మెహ్రా అన్నారు. మంగళవారం ఆమె వికారాబాద్‌లోని తన కార్యాలయ ఆవరణలో ఫ్రాడ్ కా పుల్‌స్టాప్ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా పుల్‌సా్‌ట్‌ప్ పేరిట 42 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం నుంచి జనవరి 12 వరకు ప్రతీ వారం ఒక ప్రత్యేక థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు చేపపడతామన్నారు. అవగాహనతోనే సైబర్ నేరాలు తగ్గించడం సాధ్యమన్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ తక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులకు ఆన్‌లైన్ జూమ్ మీటింగ్ ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం సైబర్ నేరాలతో మోసపోవద్దని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాములునాయక్, డీసీఆర్‌బీ డీఎస్పీ జానయ్య, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సమస్యాత్మక కేంద్రాలపై స్పెషల్ ఫోకస్
నవాబుపేట: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలు, కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. మంగళవారం ఆమె నవాబుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, ఆవరణ తదితరాలు పరిశీలించారు. అనంతరం ఎక్‌మామిడిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. విధుల్లో పాల్గొనే ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. తమకు కేటాయించిన పోలింగ్ లొకేషన్ల యొక్క భౌగోళిక పరిస్థితులు, గత ఎన్నికల చరిత్ర, అక్కడ ఉన్న సున్నితమైన అంశాల గురించి ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. రెవెన్యూ ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ, టీమ్ వర్క్‌తో పని చేయాలని, ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా విధి నిర్వహణలో బాధ్యతగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ఆమె వెంట మోమిన్‌పేట సర్కిల్ సీఐ వెంకట్, ఎస్‌ఐ పుండ్లిక్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
మోమిన్‌పేట: పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ స్నేహ మిశ్రా అన్నారు. మంగళవారం ఆమె మోమిన్‌పేట ఠాణా, ఎంపీడీఓ, కార్యాలయాలను సందర్శించారు. పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. వార్డు సభ్యుడిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థి అడివయ్యను అడిగి సెంటర్‌లో వసతులపై ఆరాతీశారు. ఎంపీడీఓ సృజన సాహిత్యతో బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, బందోబస్తు తదితర అంశాలపై మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఓ కంట కనిపెట్టాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఆమె వెంట సీఐ వెంకట్, ఎస్‌ఐ అరవింద్ తదితరులు ఉన్నారు.
ఎస్పీ స్నేహ మెహ్రా


