కొత్త అకౌంట్ నుంచే లావాదేవీలు
అనంతగిరి: ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాష అన్నారు. మంగళవారం ఆమె వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూర్‌లో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికకు జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్‌ను పరిశీలించారు. గడువు లోపు నామినేషన్లు స్వీకరించేందుకు టోకెన్లు జారీ చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చుల వివరాలపై అవగాహన కల్పించాలన్నారు. వ్యయ పరిమితిని పక్కాగా లెక్కించేలా తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త బ్యాంకు అకౌంట్ ద్వారానే ఎన్నికల లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందని వివరించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంను పరిశీలించారు. ఆమె వెంట జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, డిప్యూటీ కలెక్టర్ పూజ, ఎంపీడీఓ వినయ్ కుమార్, సీఐ భీంకుమార్ క్లస్టర్ పంచాయతీ సెక్రటరీ ప్రసన్న కుమార్ అధికారులు, తదితరులు ఉన్నారు.
జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాష


