బుజ్జగించి.. తప్పించి | - | Sakshi
Sakshi News home page

బుజ్జగించి.. తప్పించి

Dec 2 2025 9:48 AM | Updated on Dec 2 2025 9:48 AM

బుజ్జగించి.. తప్పించి

బుజ్జగించి.. తప్పించి

పంచాయతీ ఎన్నికల్లో మొదటి ఘట్టమైన తొలివిడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో విడత ప్రారంభమైంది. ఇక మిగిలింది తిరస్కరణ. బుజ్జగింపుల పర్వంతో పోరు రసవత్తరంగా..తీరు ఆకస్తికరంగా మారింది.

కొడంగల్‌/బషీరాబాద్‌: పల్లెపోరుకు రసవత్తర పోటీ నెలకొంది. పథమ పౌరుడి కుర్చీ కోసం అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. బషీరాబాద్‌ మండలంలోని 39 పంచాయతీలకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు బలపర్చిన వారితో పాటు, ఆశావహులు 208 మంది సర్పంచులకు, 312 వార్డులకు 616 నామినేషన్లు వేశారు. అయితే స్క్రూట్నిలో సరైన పత్రాలు లేని సర్పంచుకు 13, వార్డుల 10 పత్రాలను క్లస్టర్‌ రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించగా.. 195 సర్పంచ్‌, 606 వార్డు నామినేషన్లు మిగిలాయి. కాగా.. సోమవారం 10 మంది అభ్యర్థులు సబ్‌ కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకోగా.. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురయింది. కాగా మంతన్‌గౌడ్‌లోని 6వ వార్డులో అభ్యర్థి వయసు 21 ఏళ్లలోపు ఉండటంతో నామినేషన్‌ను తిరస్కరించారు. కొర్విచెడ్‌ 4వ వార్డులో ఒక్కరు కూడా నామినేషన్‌ వేయలేదు. ఈ రెండు వార్డులకు మరోసారి నోటిపికేషన్‌ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

చెక్‌‘పవర్‌’ కోసం..

రిజర్వేషన్లు అనుకూలంగా రాని ఆశావహులు.. వార్డు సభ్యులుగా బరిలోకి దిగుతున్నారు. ఉపసర్పంచ్‌కి హామీ ఇస్తేనే తమ మద్దతు ఉంటుందని ముందస్తుగా ఒప్పందం చేసుకుంటున్నారు. బషీరాబాద్‌ మండలంలో ఏకగ్రీవం అయిన మూడు జీపీల్లో.. ఉప సర్పంచులను సైతం ముందే తేల్చేశారు. ఉప సర్పంచ్‌కు ఉండే చెక్‌‘పవర్‌’తో చక్రం తిప్పొచ్చని లీడర్లు పోటీ పడుతున్నారు.

ఏకగ్రీవం.. బేరసారాలు

నామినేషన్ల స్క్రూట్ని సోమవారం ముగియడంతో పోటీగా నిలిచిన అభ్యర్థులతో నాయకులు రాయబారాలు, బేరసారాలు నడుపుతున్నారు. ముఖ్యంగా చిన్న గ్రామాల్లో ఏకగ్రీవం కోసం. అధికార పార్టీలో మండల స్థాయి నాయకులు.. పత్రాల ఉపసంహరణ కోసం వారికి నామినేటెడ్‌ డైరెక్టర్ల పదవులు ఆశచూపుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులు తెరవెనుక కొనుగోళ్లు ముమ్మరం చేస్తున్నారు. రేపు నామినేషన్ల ఉపసంహరణఉండడంతో.. పోటీదారులను మచ్చిక చేసుకొని బరినుంచి తప్పించడానికి బలమైన అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలోని పలు పంచాయతీలు ఏకగ్రీవం బాటలో చర్చలు సాగుతున్నాయి.

మాట వింటేసరి..

సర్పంచు అభ్యర్థులకు తల నొప్పి మొదలైంది. బరిలోనుంచి తప్పుకోవాలని, గ్రామాన్ని ఏకగ్రీవం చేయాలన్న బుజ్జగింపులు ఊరూరా కొనసాగుతున్నాయి. మాట వినని వారికి బెదిరింపులు తప్పడం లేదు. ఆర్థికంగా.. అంగబలం ఉన్నవారు.. సర్పంచు పోటీదారులపై ఒత్తిడి తెస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని, తాము చెప్పిన వారికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మాట వినకపోతే హుకుం జారీ చేస్తున్నారు. దీంతో పోటీదారులు సతమతం అవుతున్నారు. ఇదీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఈ అంశంలో అధికార కాంగ్రెస్‌తో పాటు.. బీఆర్‌ఎస్‌ నాయకులు పోటీపడుతున్నారు. కాగా.. కొడంగల్‌ మండలంలో సర్పంచు స్థానాలకు 123, వార్డు మెంబర్‌ స్థానాలకు 448 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఆశావహులతో పాటు.. పలు రాజకీయ పార్టీల సీనియర్‌ నాయకులు ఉన్నారు. ఇందులో రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు బరిలోనుంచి ఎంత మంది తప్పుకుంటారో.. మిగిలేది ఎందరో తేలనుంది.

రసవత్తరంగా పల్లెపోరు

చెక్‌‘పవర్‌’ కోసం బరిలోకి బడానేతలు

ఏకగ్రీవం కోసం బేరసారాలు

సర్పంచులకు 195,వార్డులకు 606 నామినేషన్లు

23 పత్రాల తిరస్కరణ,పది అప్పీళ్లు కొట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement