ఒప్పించి.. పత్రాలు రాయించి
● ఫలించిన గ్రామ పెద్దల మంతనాలు
● ఏకగ్రీవం దిశగావాల్యా నాయక్ తండా!
దుద్యాల్: పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో పూర్తయింది. ఏకగ్రీవం చేసుకుంటే పంచాయతీకి ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.10 లక్షల నజరాన ప్రకటించడంతో.. అందరి దృష్టి దానిపైనే పడింది. దీంతో సాధ్యమయ్యే గ్రామాల్లో.. అక్కడి పెద్దలు.. పోటీలో ఉన్న అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగా మండల పరిధి వాల్యానాయక్ తండాలో ఆదివారం అదే పంచాయితీ జరిగింది. బరిలో ఉన్న నలుగురితో గ్రామ పెద్దలు మాట్లాడారు. అధికార పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసి, మిగతా వారు నామినేషన్లను ఉపసంహరించుకునే విధంగా ఒప్పంద పత్రాలు రాయించుకున్నారు.
మాట నిలబెట్టుకుంటారా?
నూతనంగా ఏర్పడిన గ్రామం వాల్యానాయక్ తండా. అభివృద్ధి చెందాలంటే అధికంగా నిధులు అవసరం ఉంటుందని భావించిన తండా పెద్ద మనుషులు.. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో ఉన్న దేవిబాయి, బుజ్జిబాయి, లలితబాయి, జ్యోతిబాయిలతో ఏకగ్రీవం అంశంపై చర్చించారు. కాంగ్రెస్ అభ్యర్థి దేవిబాయిని ఏకగ్రీవం చేసుకుందామని మిగతా ముగ్గురిని ఒప్పించారు. బుజ్జిబాయి, లలితబాయి, జ్యోతిబాయిలు ఈ నెల 3న నామినేషన్లను విరమించుకోవాలని సూచించారు. దీంతో వారు అంగీకారం తెలిపారు. ఇందుకు సంబంధిత ఒప్పంద పత్రాలను ముగ్గురు నుంచి తీసుకున్నారు. కాగా.. పెద్దల మాట ప్రకారం ఏకగ్రీవం చేస్తారో? లేదో రెండు రోజులు వేచి చూడాలి. ఈ తండాకు అనుబంధంగా సోమ్ల నాయక్ తండా, కస్ననాయక్ తండా, రక్త మైసమ్మ తండా, రెడ్యా నాయక్ తండాలు ఉన్నాయి. సుమారు 700 వరకు జనాభ ఉండగా.. 450 ఓట్లు ఉన్నాయి.


