ప్రజలతో మర్యాదగా మెలగండి
● దోపిడీలు, దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి
● ఎస్పీ స్నేహమెహ్ర
పూడూరు: పోలీసులు ప్రజల పట్ల మర్యాదగా మెలగడంతోపాటు బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఎస్పీ స్నేహమెహ్ర సూచించారు. గురువారం మండలంలోని చన్గోముల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు చేసే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. దోపిడీ, దొంగతనాలు ఇతర నేరాలపై నిఘా ఉంచాలన్నారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని తెలిపారు. సిబ్బంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేయాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ భరత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
యోగా అలవాటు చేసుకోవాలి
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో గురువారం మల్టీజోన్ –2 పరిధిలోని ఏఆర్ ఎస్‌ఐలకు ఆర్‌ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పించేందుకు నిర్వహించిన శారీరక సామార్థ్య కార్యక్రమాన్ని ఎస్పీ స్నేహమెహ్ర పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగా, మెడిటేషన్, వ్యాయమాలు అలవాటు చేసుకుని శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలన్నారు. విధులను సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.


