ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం
అనంతగిరి: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని, అదనపు డీజీపీ మహేశ్ భగవత్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా నుంచి కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జిల్లాలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. మొదటి విడతలో తాండూరు, బషీరాబాద్, యాలాల్, పెద్దేముల్, కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యాల్ మండలాల్లోని 262 సర్పంచ్, 2,198 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. రెండో విడతలో వికారాబాద్, ధారూరు, మోమిన్‌పేట, నవాబుపేట, బంట్వారం, మర్పల్లి, కోట్‌పల్లి మండలాల్లోని 175 సర్పంచ్, 1,520 వార్డు సభ్యుల స్థానాలకు, మూడో విడతలో పరిగి, పూడూరు, కుల్కచర్ల, చౌడాపూర్, దోమ మండలాల్లోని 157 సర్పంచ్, 1,340 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఫ్లయింగ్, స్టాటిస్టిక్, వీడియో సర్వేలెన్స్ బృందాలు, ఎంసీఎంసీ, మీడియా సెల్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎస్పీ స్నేహామెహ్రా, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, అడిషనల్ ఎస్పీ రామునాయక్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఆర్డీఓ వాసుచంద్ర పాల్గొన్నారు.


