
బస్సు ఢీకొని యువకుడి మృతి
బొంరాస్‌పేట: ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్‌లో వెళ్తు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొని మృతి చెందిన ఘటన కొడంగల్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు..ఎన్కెపల్లి గ్రామానికి చెందిన తలారి నర్సమ్మ కుమారుడు వినోద్(21) తండ్రి కొంత కాలం క్రితమే మృతి చెందడంతో కొడంగల్‌లోని ఓ సంస్థలో డెలివరీ బొయ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. మంగళవారం ఉదయం తన స్నేహితులతో కలిసి పల్సర్ బైక్‌పై కొడంగల్‌కు వచ్చాడు. అక్కడ టిఫినన్‌్ చేసి తన స్నేహితులకు మళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. కొడంగల్‌నుంచి పరిగి రోడ్‌లో రాంగ్ రూట్‌లో అతివేగంగా వెళ్తూ హైదరాబాద్ నుంచి సేడం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ప్రమాదవశాత్తు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో వినోద్ తలకు తీవ్ర గాయాలవ్వడంతో 108 వాహనంలో స్థానికులు కొడంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి బాబాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.