
ఉరుకులు.. పరుగులు
ఎఫ్‌ఆర్‌ఎస్‌తో ఉదయమే బడికి ఉపాధ్యాయులు
దౌల్తాబాద్: ఉపాధ్యాయులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం ఈనెల 1వ తేదీ నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్) యాప్ ద్వారా టీచర్ల హాజరు నమోదు చేస్తుంది. ఉదయం 9గంటలకు.. సాయంత్రం 4.15 గంటల తర్వాత రెండుసార్లు ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మొన్నటి వరకు ఇష్టారాజ్యంగా పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు ఇప్పుడు ఉదయం 9గంటల్లోపే స్కూల్‌కు వెళళ్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆన్‌లైన్ అటెండెన్స్ చూపిస్తుండడంతో ముందుగానే బడికి చేరుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు మేలు జరుగుతుందని పలువురు విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
సాకులకు చెక్
మొన్నటివరకు ఉపాధ్యాయులు కొందరు పాఠశాలకు ఆలస్యంగా వెళ్లేవారు. ఒకవేళ హెచ్‌ఎం అడిగితే కొందరు ఎదురుతిరిగేవారు. మరికొందరు రాజకీయ నేతల అండతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించేవారు. కొంతమంది హైదరాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట నుంచి వచ్చేవారు. వారు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి ఉండేది. ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరు ఒక రోజు.. మరొకరు ఇంకో రోజు పాఠశాలకు వెళ్లేవారు. సాయంత్రం 4గంటలు కాకముందే ఇంటిబాట పట్టేవారు. బస్సులు దొరకడంలేదనే సాకుతో ముందే తోటి ఉపాధ్యాయులకు చెప్పి బడి నుంచి కొందరు బయటపడేవారు. వీటన్నింటికీ ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ యాప్ చెక్ పెట్టంది.
నిర్ణీత సమయం పాటించాలి
ఉదయం 9 గంటల్లోపు ఉపాధ్యాయులు వారు పనిచేస్తున్న పాఠశాలలకు వెళ్లి ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో అటెండెన్స్ వేసుకోవాలి. ఆ పాఠశాల ఆవరణలో ఉండి అటెండెన్స్ వేస్తేనే ఫొటో క్యాప్చర్ అవుతుంది. 9గంటలకు ఒక్క నిమిషం దాటినా యాప్‌లో అటెండెన్స్ ప్రసెంట్ అని చూపినా పక్కన రెడ్‌మార్కు చూపుతుంది. అలాగే సాయంత్రం 4:15 గంటల లోపు వెళ్లినా హాజరు తీసుకోదు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాలకు పూర్తి సమయం కేటాయిస్తున్నారు.
సెలవులూ ఆన్‌లైన్‌లోనే
ఏ ఉపాధ్యాయుడైనా తనకు సెలవు కావాలంటే గతంలో లిఖిత పూర్వకంగా లేదా మౌఖికంగా హెచ్‌ఎంకు చెప్పి తీసుకునేవారు. హెచ్‌ఎం సెలవు కాదంటే లీవ్ లెటర్ రాసి స్కూల్‌లో పెట్టి వెళ్లిపోయేవారు. కానీ అందుకు కాలం చెల్లింది. సెలవు కావాలనుకునే ఉపాధ్యాయుడు ఈ యాప్‌లోనే సెలవు పెట్టుకుంటే అది స్కూల్ హెడ్‌మాస్టర్‌కు వెళుతుంది. హెచ్‌ఎం ఆమోదిస్తేనే సెలవు తీసుకోవచ్చు. రిజక్ట్ చేస్తే కచ్చితంగా పాఠశాలకు హాజరు కావాలి.
రెండుపూటలా హాజరుతో డుమ్మా కొట్టేందుకు నో ఛాన్స్
మంచి పరిణామంటున్న పలువురు విద్యావేత్తలు