
కంప్యూటర్ల అందజేత
బొంరాస్‌పేట: మండలంలో ఏఐ కింద ఎంపికై న ప్రాథమిక పాఠశాలలకు సోమవారం కంప్యూటర్లను ఎంఈఓ హరిలాల్ అందజేశారు. మొదటి విడతలో 10 పాఠశాలలు ఎంపిక అయ్యాయని, అందులో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. కుర్చీలు, బెంచీలు నేరుగా పాఠశాలలకు అందుతాయన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు మల్లేశం, లక్ష్మయ్య, సీఆర్‌పీ సోమ్లా, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
తరలుతున్న గణపయ్యాలు
తాండూరు రూరల్: మండలంలోని ఆయా గ్రామాల్లో వినాయక చవితి సందర్భంగా సందడి నెలకొంది. తాండూరు పట్టణంలోని వినాయక తయారీ సెంటర్ల నుంచి గణనాథులను పల్లెలకు తరలిస్తున్నారు. సోమవారం చిన్నారులు తమ గణపయ్యను ట్రాక్టర్‌లో వారి గ్రామానికి తీసుకెళ్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే మండపాలను సిద్ధం చేశారు. వాడవాడలా పండుగ వాతవారణం నెలకొంది.
భక్తిశ్రద్ధలతో వరాహస్వామి జయంతి
కొడంగల్ రూరల్: పట్టణంలోని పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో వరాహస్వామివారి జయంతిని సోమవారం ఆలయ ధర్మకర్తలు, పురోహితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, దూపం, దీపం, నైవేద్యాలను సమర్పిస్తూ మంగళహారతులు అందించారు. భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
రోడ్డు విస్తీర్ణం తగ్గించండి
దుద్యాల్: వంద ఫీట్ల రోడ్డుతో తీవ్రంగా నష్టపోతామని మండల పరిధిలోని పోలేపల్లి గ్రామస్తులు కలెక్టర్‌ను కోరారు. సోమవారం గ్రామానికి చెందిన కొందరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో భాగంగా 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రతిపాదించింది. నాలుగు లైన్ల రోడ్డు ఏర్పాటుతో ఇరుపక్కల ఉన్న మా ఇళ్లు పూర్తిగా పోతున్నాయని వాపోయారు. రోడ్డు విస్తీర్ణం తగ్గించాలని కోరారు.

కంప్యూటర్ల అందజేత