
ఏటీసీతో ఉజ్వల భవిష్యత్
తాండూరు టౌన్: తాండూరులో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని పలువురు మండల విద్యాధికారులు, ప్రిన్సిపాళ్లు, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ సభ్యులు అన్నారు. సోమవారం పట్టణ శివారులో రూ.25 కోట్లతో నిర్మించిన ఏటీసీ కళాశాలను వారు సందర్శించారు. అనంతరం కళాశాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా కోర్సులను తీసుకురావడం శుభసూచకమన్నారు. కోర్సు పూర్తయిన వెంటనే 100 శాతం ఉద్యోగ భద్రత దక్కడం హర్షణీయమన్నారు. తాండూరు ఏటీసీ కళాశాలలో ఆరు కోర్సుల్లో 172 మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం ఉందన్నారు. ఈనెల 28వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కృషితో ప్రభుత్వం పరికరాల కొనుగోలుకు రూ.65 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. ఏటీసీ కళాశాల ప్రిన్సిపాల్ సాయన్న, పలు మండల విద్యాధికారులు వెంకటయ్యగౌడ్, నర్సింగ్‌రావు, రమేష్, రాములు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు మల్లినాథప్ప, నర్సింహారెడ్డి, నర్సిములుతో పాటు ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ సభ్యులు రవీంద్ రెడ్డి, సుహాస్, శివ, మోహనకృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.