
హిందూ ఉత్సవ సమితి స్థల అభివృద్ధికి కృషి
తాండూరు: హిందూ ఉత్సవ కేంద్ర సమితికి కేటాయించిన స్థలంలో పండుగలు జరుపుకునేందుకు వేదికగా మండపాలను నిర్మిస్తామని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, హిందూ ఉత్సవ సమితి చైర్‌పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్ అన్నారు. ఆదివారం పట్టణ శివారులోని ఖాంజాపూర్ గేట్ వద్ద హిందూ ఉత్సవ కేంద్ర సమితి స్థలంలో బోరు వేయించారు. స్వప్నపరిమళ్, పట్లోళ్ల నర్సింహులు, బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి, సందల్ రాజుగౌడ్ సంఘం సభ్యులతో కలిసి పూజలు ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి ప్రతినిధులు సంతోశ్ కుమార్, భానుకుమార్, రామకృష్ణ, నాయకులు ప్రభాకర్‌గౌడ్, రామకృష్ణ, ప్రవీణ్‌గౌడ్, పటేల్ కిరణ్, వేణుగోపాల్, శ్రీనివాస్, శ్రీకాంత్‌రెడ్డి తదితరులున్నారు.
వినాయక ఉత్సవాలను
నిరాకరించడం తగదు
హిందూ వాహిని
జిల్లా ఉపాధ్యక్షుడు సాయిగణేశ్
కుల్కచర్ల: ముజాహిద్‌పూర్ మోడల్ స్కూల్‌లో వినాయక ఉత్సవాలు నిర్వహించొద్దని ప్రిన్సిపాల్ విద్యార్థులకు చెప్పడాన్ని ఖండిస్తున్నామని హిందూ వాహిని జిల్లా ఉపాధ్యక్షుడు సాయిగణేశ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఆధ్యాత్మిక భావాలను విద్యార్థులకు అలవాటు చేయాల్సిన ప్రిన్సిపాల్..నిరాకరించడం ఎంత వరకు సమంజసమని మండిపడ్డారు. హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రిన్సిపాల్ వ్యవహరించడం తగదన్నారు. వెంటనే మోడల్ స్కూల్‌లో విద్యార్థులు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పూజలు నిర్వహించునేలా ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో జిల్లా హిందూ వాహిని ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
నేను కోరుకున్న జీవితం ఇది కాదు..
సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య
బంజారాహిల్స్: ‘అమ్మా..నాకు ఈ జీవితం నచ్చడం లేదు..నేను కోరుకున్న లైఫ్ ఇది కాదు.. నా జీవితాన్ని ఇంకోరకంగా ఊహించుకున్నా..ఇప్పుడు జరుగుతున్నది వేరేగా ఉంది..నాకు నచ్చని ఈ బతుకు ముగించాలనుకుంటున్నాను’ అంటూ ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్‌బెంగాల్‌కు చెందిన దేబషిష్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో నిర్మాణంలో ఉన్న మంత్రి కన్‌స్ట్రక్షన్స్‌లో క్వాలిటీ కంట్రోలర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే ఆవరణలో గత కొంతకాలంగా ఒక గదిలో ఉంటున్నాడు. అయితే వారం రోజుల నుంచి అదోలా ఉంటూ..తనకు ఈ జీవితం నచ్చడం లేదంటూ సహచర సిబ్బందితో వాపోయేవాడు. అనుకున్న విధంగా బతుకు కొనసాగడం లేదని అశాంతితో గడుపుతూ చివరకు తల్లికి సూసైడ్ నోట్ రాసి తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుంగ్‌ఫూ పోటీల్లో న్యూమాంక్స్ సత్తా
వేర్వేరు విభాగాల్లో ముగ్గురికి గోల్డ్‌మెడల్
కొందుర్గు: నగరంలోని యూసూప్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ ఆల్ స్టైల్ కుంగ్‌ఫూ, కరాటే పోటీల్లో కొందుర్గు న్యూమాంక్స్ విద్యార్థులు ప్రతిభ చూపినట్లు మాస్టర్ రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలు అండర్–12 కటాస్ విభాగంలో ఎదిర అనసూయ గోల్డ్ మెడల్, అండర్–14 బాలికల ఫైరింగ్ విభాగంలో నహీద్ గోల్డ్ మెడల్ సాధించారని తెలిపారు. బాలురు అండర్–16 ఫైరింగ్‌లో సాయితేజ గోల్డ్ మెడల్ సాధించగా అండర్–8 విభాగంలో ఎండీ ముజీబ్ ప్రతిభ చూపినట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను న్యూమాంక్స్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌పటేల్, తెలంగా చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ బాల్‌రాజ్ అభినందించారు.
సామాజిక అంశాలపై అవగాహన
శంషాబాద్ రూరల్: మండలంలోని రామంజాపూర్‌లో సామాజిక విజ్ఞాన కళాశాల విద్యార్థు లు శనివారం రాత్రి నాటిక ప్రదర్శనతో పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. ‘కృతజ్ఞత విలువ–వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సంరక్షణ’ అనే అంశంపై నాటకాన్ని ప్రదర్శించారు. తల్లిదండ్రుల ప్రేమ, త్యాగాలను గుర్తించుకుని వృద్ధాప్యంలో వారిని గౌరవిస్తూ సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

హిందూ ఉత్సవ సమితి స్థల అభివృద్ధికి కృషి