
విస్తరాకుల తయారీతో ఉపాధి
కుల్కచర్ల: ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సౌకర్యాలను చెంచు ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక పురోగతి సాధించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం మండలంలోని సాల్వీడు గ్రామంలో సయోధ్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వరంలో విస్తరాకుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెంచుల సంక్షేమానికి ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకొని జీవన విధానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. చెంచులకు అవసరమైన ధ్రువపత్రాలు వెంటనే అందించేందుకు చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు సూచించారు. విస్తరాకుల తయారీ రంగంలో మరింత మందికి ఉపాధిని కల్పించేటా చూడాలని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి, ఏపీడీ నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంపీడీఓ రామకృష్ణ, మహిళ సమాఖ్య అధ్యక్షురాలు సంతోష, చెంచు సంఘం నాయకులు పాల్గొన్నారు.