
‘అభయహస్తం’ సంచులు సిద్ధం
తాండూరు: రేషన్ బియ్యం లబ్ధిదారులకు ప్రత్యేక సంచులు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నాణ్యమైన కాటన్, పేపర్‌తో తయారు చేసిన బ్యాగులు ఇప్పటికే తాండూరులోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు చేరుకున్నాయి. నియోజకవర్గంలోని 66,321 మంది లబ్ధిదారులకు ఒక్కోటి చొప్పున అందజేయనున్నారు. బ్యాగులపై ఆరు గ్యారంటీల అభయహస్తం లోగోతో పాటు ఇందిరాగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలను ముద్రించారు. నిత్యావసర సరుకులు తెచ్చుకునే విధంగా వీటిని రూపొందించారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి అడ్డుకట్ట వేయడంతో పాటు పర్యావరణ హితానికి ఇవి దోహదం చేస్తాయని గోదాం ఇన్‌చార్జ్ రవి తెలిపారు. నియోజకవర్గంలోని 249 రేషన్ దుకాణాల ద్వారా 1,200 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.