
ఇదేం రహదారి!
● వర్షాలతో బురదమయం
● అవస్థలు పడుతున్న వాహనదారులు
● నత్తనడకన హైవే పనులు
● ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్
తాండూరు రూరల్: మండలంలో నిర్మిస్తున్న హైవే రోడ్డును చూసి జనాలు విసిగిపోతున్నారు. మహబూబ్‌నగర్ నుంచి కర్ణాటక రాష్ట్రం మన్నెకెళ్లి వరకు జాతీయ రహదారి నంబరు 167 నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలో అల్లాపూర్ నుంచి కోత్లాపూర్ వరకు 15 కిలో మీటర్లమేర రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ ఇప్పటి వరకు పనులు పూర్తి చేయలేదు. అసంపూర్తిగా రహదారి పనులు కొనసాగడంతో మండల ప్రజలతో పాటు కర్ణాటకకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా కురిసిన వర్షానికి హైవే రోడ్డంతా బురదమయమైంది. ముఖ్యంగా అల్లాపూర్ బ్రిడ్జి వద్ద గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలవడంతో ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇక రాత్రి సమయంలో గుంతలు కనిపించకపోవడంతో భయందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్లాపూర్ నుంచి కోత్లాపూర్ వరకు జాతీయ రహదారిపై నరకం చూస్తున్నామని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా హైవే అధికారులు, కాంట్రాక్టర్లు చొరవచూపి హైవే పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదేం రహదారి!