
వీడిన ఆలయాల చోరీ కేసు
యాలాల: మండల పరిధిలోని సంగెంకుర్దు శివారులో గల సంగమేశ్వరాలయం, శనీశ్వర ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం రాత్రి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ నగేష్ వివరాలు వెల్లడించారు. యాలాల గ్రామానికి చెందిన బోయిని హరీష్, ఉప్పరి అరవింద్ స్నేహితులు. జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యారు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీకి ప్లాన్ చేశారు. ఈ నెల 19న సంగెంకుర్దు శివారులో ఉన్న సంగమేశ్వరాలయం, శనీశ్వరాలయంలో చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. రాత్రి చోరీకి వెళ్లే సమయంలో తమ వెంట ఒక సుత్తి, ఐరన్‌రాడ్, వంటలకు వినియోగించే గరిటేను తీసుకెళ్లారు. వాటితో ఆలయ ప్రధాన గేటు తాళం పగులగ్గొట్టి లోనికి వెళ్లారు. ఆలయ ఆవరణలో ఉన్న హుండీ తాళం విరగ్గొట్టి రూ.20వేల నగదును ఎత్తుకెళ్లారు. అనంతరం పక్కనే ఉన్న శనీశ్వరాలయంలోకి వెళ్లి అక్కడి హుండీ తాళం విరగ్గొట్టి రూ.10వేల నగదుతో హైదరాబాద్‌కు ఉడాయించారు. చోరీ ఘటన అనంతరం ఫిర్యాదు అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి అనుమానితులైన వీరిని అదుపులోకి విచారించగా నేరం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి చోరి సొత్తులో రూ.8 వేలు ఖర్చు కాగా, రూ.22వేలతో కొనుగోలు చేసిన సౌండ్ సిస్టంకు వినియోగించే (ఆంప్లిఫైర్)స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ విఠల్, ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ దస్తప్ప, కానిస్టేబుళ్లు నరేష్, వెంకటయ్య ఉన్నారు.
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
రిమాండ్‌కు తరలింపు
కేసు వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ నగేష్