
హిందూ ఉత్సవ సమితికి అండ
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే హామీ
తాండూరు టౌన్: హిందూ ఉత్సవ కేంద్ర సమితికి తాము వెన్నంటి ఉంటామని మండలి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిలు అన్నారు. గురువారం నూతనంగా నియామకమైన తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి కార్యవర్గం మర్యాద పూర్వకంగా హైదరాబాద్‌లో వారిని వేర్వేరుగా కలిశారు. ఈసందర్భంగా హిందూ సంప్రదాయ పండగల నిర్వహణ, ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సిములు మాట్లాడుతూ.. సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు కార్యక్రమాలకు, భవన నిర్మాణానికి తదితరాలకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే ఒక విడత నిధులు మంజూరు చేశారని, విడతల వారీగా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తామన్నారని చెప్పారు. అలాగే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కార్యాలయానికి వెళ్లగా, ఆయన అందుబాటులో లేరని తెలిపారు. కార్యక్రమంలో సమితి కోశాధికారి సంతోష్‌కుమార్, ఉపాధ్యక్షులు పరమేశ్వర్, శ్రీకాంత్‌రెడ్డి, అధికార ప్రతినిధులు రామకృష్ణ, అశోక్, గోపాల్, కుమార్ తదితరులు ఉన్నారు.