
నిబంధనలు తప్పనిసరి
గణేశ్ మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
దోమ: ఊరూరా వినాయక చవితి సందడి ప్రారంభమైంది. మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిమగ్నమయ్యారు. వివిధ రూపాల్లో గణనాథుడి విగ్రహాలను కొలువుదీర్చేందుకు బుకింగ్‌లు చేసుకొని సిద్ధమవుతున్నారు. దీంతో అధికారులు సైతం మండపాల ఏర్పాటుపై నియమనిబంధనలు పాటించాల్సిందేనని చెబుతున్నారు. ఊరురా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి సూచనలు ఇస్తున్నారు. ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో పొందిన అనుమతి పత్రాన్ని తప్పనిసరిగా భద్రపరుచుకోవాలంటున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వినాయక విగ్రహాల వద్ద, నిమజ్జన కార్యక్రమంలో డీజేలను నిషేధిస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు.
ఇవి పాటించాలి
● వినాయక చవితి నేపథ్యంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు కచ్చితంగా పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. ఎన్ని రోజులు పెడుతున్నారు? ఎన్ని రోజుల్లో నిమజ్జనం చేస్తున్నారు? అనే అంశాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చుకోవాలి.
● గణేశ్ మండపాలను ఏర్పాటుకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలి. మండపాల ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.
● విద్యుత్ శాఖ అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ జరగకుండా మంచి నాణ్యమైన వైరు ఉపయోగించాలి.
● మండపాల నిర్వాహకులు మండపాల కమిటీకి సంబంధించిన వివరాలు, బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నంబర్లను పోలీసులకు అందించాలి.
● వృద్ధులు, చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శబ్ద కాలుష్యం లేకుండా స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలి.
● సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. మండపాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలను ఏర్పాటు చేయరాదు.
● మండపాల్లో మంటలు చెలరేగితే ఆర్పేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీపంలో రెండు బకెట్‌ల నీళ్లు, ఇసుక ఏర్పాటు చేసుకోవాలి.
● మండపాల వద్ద మద్యం తాగడం, పేకాట ఆడడం, లక్కీ డ్రాలు నిర్వహించడం, అసభ్యకర నృత్యాలతో ప్రదర్శనలు చేయడం, అన్యమతస్తులను కించపరిచేలా ప్రసంగాలు చేయడం పూర్తిగా నిషేధం.
● విధిగా పాయింట్ బుక్ ఏర్పాటు చేసుకోవాలి. పోలీస్ అధికారులు నిత్యం తనిఖీలు చేసినప్పుడు అందులో సమయం రాసి సంతకం చేసి వెళ్తారు.
● మండపాల్లో ఏదైనా అనుమానస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే తక్షణమే డయల్ 100 కానీ, లేదా స్థానిక పోలీసులకు లేదా జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 87126 70056కు సమాచారం అందించాలి.
డీజే వినియోగంపై నిషేధం
పోలీసుల అనుమతితో
నవరాత్రుల నిర్వహణ
రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు
పరిగి డీఎస్పీ శ్రీనివాస్

నిబంధనలు తప్పనిసరి