
తెగిన రోడ్డు.. రాకపోకలకు పాట్లు
● కొత్త బ్రిడ్జి నిర్మాణం వద్ద
కొట్టుకుపోయిన రహదారి
● మండలవాసుల నరకయాతన
బొంరాస్‌పేట: భారీ వానలకు రహదారి కొట్టుకుపోవడంతో మండలవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి నుంచి మండల కేంద్రానికి ఉన్న ప్రధాన రోడ్డు ఇటీవల వానలకు తెగిపోయింది. ఈ మార్గంలో చెరువు అలుగు పారే చోట నూతనంగా డబుల్ వే వంతెన నిర్మిస్తున్నారు. తాత్కాలికంగా పాత రోడ్డు నుంచి నిత్యం రాకపోకలు జరిగేవి. కాగా ఇటీవల ఎడతెరిపిలేని వర్షాలకు వాగు ఉధృతంగా పొంగి పాత రోడ్డు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిత్యం మండల కేంద్రానికి వెళ్లాలంటే వాహనదారులు బుర్రితండా, మెట్లకుంట మీదుగా 6కి.మీ దూరం నుంచి తిరిగి వస్తున్నారు. దూరభారంతో మండల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నామని పేర్కొంటున్నారు.
ఆటోవాలా.. దివాలా
మండల కేంద్రానికి నిత్యం ప్రజల రాకపోకలతో రవాణా చేసేందుకు మెట్లకుంట, తుంకిమెట్ల, పలు తండాలకు చెందిన సుమారు 30 ఆటోలున్నాయి. రహదారి బంద్ కావడంతో ఆటోవాలాలు రోజంతా దివాలా తీస్తున్నామని వాపోతున్నారు. దూరం గ్రామాల నుంచి వెళ్లేందుకు ప్రయాణికులు ముందుకు రావడం లేదంటున్నారు. దీంతో రోజు గడవడమే అగమ్యగోచరంగా మారింది. మండల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వంతెన పరిశీలన
మండల ప్రజల అవస్థలు తీర్చేందుకు రాష్ట్ర ఈజీఎస్ కమిషన్ సభ్యుడు నర్సింలుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి చొరవ తీసుకున్నారు. గురువారం సంబంధిత అధికారులతో వంతెనను పరిశీలించారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం సంపూర్ణం కాలేదని, మరిన్ని పనులు కొనసాగుతున్నాయని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. తాత్కాలిక ప్రత్యామ్నాయానికి చర్యలు చేపడతామన్నారు. మండల ప్రజలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న అవస్థలను అధికారులకు వివరించారు. క్యూరింగ్ సమయం పూర్తికాలేదన్నారు. భారీ వాహనాల రాకపోకలతో వంతెన దెబ్బతింటుందన్నారు. మరో ఐదు రోజుల్లో కొత్త వంతెనను వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.