
ఫోర్జరీ చేసి.. నగదు కాజేసి
● తెలంగాణ గ్రామీణ బ్యాంకులో
అవినీతి బాగోతం
● రైతుల ఖాతా నుంచి
డబ్బులు స్వాహా చేసిన ఉద్యోగులు
తాండూరు: తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అవినీతి బాగోతం బయటపడింది. బ్యాంకు ఉద్యోగులే నకిలీ ఖాతాలను సృష్టించి ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులను స్వాహా చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. పట్టణంలోని సాయిపూర్ రోడ్డులో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు రైతులకు సేవలను అందిస్తోంది. కొన్నాళ్ల క్రితం తాండూరుకు చెందిన ఓ రైతు బ్యాంకులో రూ.4 లక్షల నిధులను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ప్రేమ్‌సింగ్, అరవింద్ ఈ విషయాన్ని గమనించారు. ప్రేమ్‌సింగ్ తన బంధువు అజయ్‌తో కలిసి డబ్బులను స్వాహా చేసేందుకు పథకం రచించారు. అందుకు అదే బ్యాంకులో ఓ మహిళ పేరిట నకిలీ ఖాతా తెరిచారు. తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులు విత్ డ్రా చేసుకొనేందుకు సదరు రైతు నుంచి సంతకాలు తీసుకున్నారు. అనంతరం నకిలీ ఖాతాలోకి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకొని పంచుకున్నారు.
పోలీసుల అదుపులో ఉద్యోగులు
ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులను తీసుకొనేందుకు రైతు కుటుంబం బ్యాంకుకు వచ్చింది. మేనేజర్ ఖాతాను పరిశీలించి డబ్బులు డ్రా చేసుకుని మళ్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన రైతు కుటుంబం ఫిర్యాదు చేసింది. సంబంధిత పత్రాలు పరిశీలించి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన డబ్బులు పక్కదారి మళ్లించినట్లు మేనేజర్ శ్రీనివాస్‌రావు గుర్తించారు. దీనిపై ప్రైమ్‌సింగ్, అరవింద్‌లపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. సీఐ సంతోష్ ఆధ్వర్యంలో ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది.