
పీర్ల మసీదులో బోధన
మేడికొండలో గణేశ్ మండపంలోస్కూల్ నిర్వహణ బిల్లులు రాకపోవడంతో భవనం అప్పగించని కాంట్రాక్టర్ ఇబ్బందుల్లో విద్యార్థులు పట్టించుకోని ఉన్నతాధికారులు
పూడూరు: గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల శిథిల భవనాల్లో, వర్షాలకు ఉరుస్తున్న గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు స్కూళ్ల బిల్డింగులు లీకేజీ అవుతున్నాయి. మండలంలోని మేడికొండ పాఠశాల భవనం లీకేజీ అవుతుండటంతో టార్పాలిన్ కప్పి ఉంచారు. ప్రస్తుతం గణేశ్ మండపంలో స్కూల్ నిర్వహిస్తున్నారు. రాకంచర్ల గ్రామంలో పీర్ల మసీదులో బోధన చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని రాకంచర్ల పాఠశాలలోకి నీరు చేరింది. విద్యార్థులు స్కూల్‌లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఉపాధ్యాయులు స్కూల్ పక్కన ఉన్న పీర్ల మసీదులో పాఠశాలను నిర్వహిస్తున్నారు. బెంచీలు వేసి 30 మంది విద్యార్థులకు బోధన చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో మన ఊరు మన బడి పథకం కింద నూతన భవనాలు మంజూరయ్యాయి. కొన్ని చోట్ల పనులు పూర్తయినా బిల్లులు రాలేదు. దీంతో కాంట్రాక్టర్లు స్కూళ్లకు తాళాలు వేసుకున్నారు.
మేడికొండలో..
మండలంలోని మేడికొండ ప్రాథమిక పాఠశాలలో 15మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరడంతో రెండేళ్ల క్రితం మండల పరిషత్ నిధుల నుంచి నూతన భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకోసం రూ.5.5లక్షలు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రెండు గదులు నిర్మించాడు. బిల్లు మంజూరు కాకపోవడంతో భవనాన్ని పాఠశాలకు అప్పగించలేదు. వర్షాలు పడిన ప్రతిసారీ గణేశ్ మండపంలో తరగతులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలోకి వర్షపు నీరు చేరడంతో..
మరమ్మతులు చేయిస్తాం
మేడికొండ, రాకంచర్ల ప్రాథమిక పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు లీకేజీ అవుతున్నాయి. దీంతో పక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రం, అసంపూర్తిగా ఉన్న భవనంలో పాఠశాలల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. రాకంచర్లలో అదనపు భవనం కోసం ప్రతిపాదనలు పంపాం.
– సాయిరెడ్డి, ఎంఈఓ పూడూరు

పీర్ల మసీదులో బోధన