
మ్యాపింగ్
సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రక్రియ
పక్కాగా
విలేజ్
వికారాబాద్: రెవెన్యూ రికార్డుల విషయంలో సర్వేకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రైతుల మధ్య పొలాల సరిహద్దు సమస్యలు.. మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు.. రాష్ట్రాల సరిహద్దుల విషయంలో నిత్యం ఏదో ఒక చోట వివాదం చెలరేగుతూనే ఉంటుంది. విలేజ్ మ్యాపింగ్ విషయంలోనూ అనేక సమస్యలు ఉన్నాయి. ఎలాంటి సాంకేతికత లేని రోజుల్లో చేసిన సర్వే మ్యాపులే నేటికీ ఆధారం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సాంకేతికతను జోడించి పక్కాగా గ్రామాల సరిహద్దులు నిర్ణయించే సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మన జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గురువారం నుంచి సర్వే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు స్థానిక సర్వేయర్లు సర్వే ఆఫ్ ఇండియా సభ్యులకు సహకరించనున్నారు.
డిజిటల్ పరికరాల సాయంతో..
డిజిటల్ పరికరాల సాయంతో శాటిలైట్ సేవలను వినియోగిస్తూ పక్కాగా సర్వే చేపట్టనున్నారు. ముందుగా గ్రామాల సరిహద్దులు నిర్ణయించనున్నారు. జిల్లాలో మొత్తం 594 జీపీలు.. 510 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామాల ఆధారంగా సర్వే చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రామ సరిహద్దుతో కూడిన మ్యాపింగ్‌ను జిల్లా అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. భవిష్యత్తులో ఈ మ్యాప్‌లు కీలకం కానున్నాయి. జిల్లాలో సర్వే ప్రక్రియ విజయవంతమైతే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో చేపడతారు. ప్రస్తుతం జిల్లా అధికారులు సర్వే ఆఫ్ ఇండియా అధికారులకు సహకరిస్తున్నారు.
కర్ణాటక సరిహద్దులు తేలేనా..?
మన జిల్లాకు కర్ణాటకతో సరిహద్దు వివాదం చాలా కాలంగా నడుస్తోంది. తాండూరు నియోజకవర్గం పరిధిలోని బషీరాబాద్, తాండూరు, పెద్దేముల్, వికారాబాద్ నియోజకవర్గంలోని బంట్వారం, అలాగే కొడంగల్ మండలానికి కర్ణాటకతో సరిహద్దు వివాదం ఉంది. తెలంగాణ అటవీ శాఖకు చెందిన వేల ఎకరాలను కర్ణాటక వాసులు కబ్జా చేసినట్లు జిల్లా ఽఅధికారులు గుర్తించారు. ఈ విషయమై గతంలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య గొడవలు కూడా జరిగాయి. కాగ్నా నదిలో ఇసుక వాటా విషయంలోనూ తగాదాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చేపట్టే సర్వే వివాదానికి ముగింపు పడుతుందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.
సహకరించాలి
గ్రామాల సరిహద్దు నిర్ధారణ కోసం సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న సర్వేకు అందరూ సహకరించాలి. సర్వేపై ఎలాంటి సందేహాలు వద్దు. ఈ ప్రక్రియ పూర్తయితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పొలాల మధ్య, గ్రామాల మధ్య సరిహద్దు సమస్యలు ఉండవు.
– రాంరెడ్డి, ఏడీ సర్వే, ల్యాండ్ రికార్డ్స్

మ్యాపింగ్