
కళాశాల విద్యే కీలకం
బొంరాస్‌పేట: విద్యార్థికి ఉద్యోగం, ఉపాధితో బంగారు భవిషత్తుకు జూనియర్ కళాశాల విద్యే మూలాధారంగా ఉంటుందని ఇంటర్ జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్‌నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపాల్ రోజారాణితో కళాశాల నిర్వహణ, విద్యాప్రగతి, వసతులపై చర్చించారు. నిధుల వినియోగానికి కమిటీ ఆయోదం చేయాలన్నారు. విద్యార్థులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలకు జూనియర్ కళాశాలలు మంజూరయ్యాయని తెలిపారు. భవన నిర్మాణ పనులు సాగుతున్నాయని అన్నారు. మౌలిక వసతులు, సదుపాయాలను కల్పించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో స్థానిక కళాశాల విద్యార్థులకు బెంచీలు, కార్యాలయానికి బీరువాలు, కుర్చీలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి అన్నారు. తల్లిదండ్రుల కలలు నిజం చేయడానికి తపించాలని విద్యార్థులకు సూచించారు. అధ్యాపక బృందం, విద్యార్థుల స్పందన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పోటీతత్వాన్ని ఎదుర్కోవడానికి తగు సూచనలిచ్చారు. మార్కులే కాదు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు.