
కళ్లకు గంతలతో గణితావధానం
తాండూరు టౌన్: కళ్లకు గంతలు కట్టుకుని బోర్డుపై రాసిన పదాలను ఓ గణితావధాని అలవోకగా చెప్పడంతో విద్యార్థులు ఆశ్చర్యపోయారు. గురువారం తాండూరు పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో ప్రముఖ గణితావధాని, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, రిటైర్డ్ ఉపాధ్యాయుడు కోకట్‌కు చెందిన అనంతప్ప అవధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు మాయా కూడిక, మాయా చదరంపై మెలకువలు నేర్పించారు. అనంతరం మెమొరీ శతావధానంలో భాగంగా, విద్యార్థులు బోర్డుపై 100 వరకు రాసిన ప్రముఖులు, వాహనాలు, జంతువులు, వస్తువుల పేర్లను కళ్లకు గంతలు కట్టుకుని చెప్పారు. ఏ ఒక్క పేరు తప్పు చెప్పకుండా అన్నీ కరెక్టుగా చెప్పడంతో విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. విద్యార్థులు కష్టపడి చదవడం కాకుండా ఇష్టపడి చదివేలా చూడాలన్నారు.ఎలాంటి సమస్యలుఉన్నా సులువైన విధానంలో సమాధానం రాబట్టేలా వారి కి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తర్ఫీదు ఇవ్వాలన్నారు. తాను తొలినాళ్లలో శిశుమందిర్‌లోనే ఉపాధ్యాయునిగా జీవనం ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు డీ విజయలక్ష్మి,కార్యదర్శి అనంతరెడ్డి,కోశాధికారిరాంరెడ్డి, ఆచార్య, మాతాజీలు, విద్యార్థులు పాల్గొన్నారు.