
మీ సేవలో దోపిడీ!
● ఒక్కో రేషన్ కార్డుకు
రూ.1,500 చొప్పున వసూలు
● నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల సేకరణ
● తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు
ప్రభుత్వాన్ని
బద్నాం చేస్తున్నారు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం రేషన్‌కార్డులు అందిస్తోంది. కొన్ని చోట్ల మీ సేవ నిర్వాహకులు మాత్రం అధిక మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే దరఖాస్తులు పక్కన పెడుతున్నారు. అమాయక ప్రజలను దోచుకుంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న మీ సేవ కేంద్రాల నిర్వాహకులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. ఆయా పనుల కోసం వెళ్లే వారు నిర్దేశిత ఫీజులు మాత్రమే చెల్లించాలి.
– అజీం పటేల్, డీసీసీ కార్యదర్శి
చర్యలు తీసుకుంటాం
మీ సేవ కేంద్రానికి వచ్చే ప్రజల వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. రేషన్ కార్డులు ఇప్పిస్తామని మీ సేవ కేంద్రం నిర్వాహకుడు డబ్బులు తీసుకున్నాడని మన్నెగూడకు చెందిన వారు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– భరత్‌గౌడ్, తహసీల్దార్ పూడూరు
పూడూరు: ప్రజలకు ఆన్‌లైన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాల్లో అవినీతి జలగలు పీక్కు తింటున్నాయి. కానీ సంబంధిత అధికారులు వీరిపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన్నెగూడకు చెందిన సనాబేగం, జాకీర్ హుస్సేన్ రేషన్‌కార్డుల దరఖాస్తు చేసుకునేందుకు పూడూరులోని మీ సేవ కేంద్రానికి వెళ్లారు. వీరి నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.1500 చొప్పున వసూలు చేసిన నిర్వాహకులు మొత్తం రూ.3 వేలు తీసుకున్నారు. రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత మాదేనని చెప్పారు. మండల పరిధిలోని అన్ని మీ సేవల పరిస్థితి ఇలాగే తయారైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయా దరఖాస్తులకు ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులకు విరుద్ధంగా వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయంలో కింది స్థాయి సిబ్బంది వీరితో కుమ్మకై ్క దండుకుంటున్నారు. అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి మరీ వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో తరచూ ఎక్కడో ఓ చోట ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా అక్రమాలు ఆగడం లేదు. అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుతో ఇటీవల ధారూరులోని మీ సేవ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు. కానీ ప్రభుత్వ పథకాలు కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని నిర్వాహకులు బెదిరిస్తున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మొదలుకుని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వరకు అన్ని దరఖాస్తులు మేమే చూసుకుంటాం అంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు.

మీ సేవలో దోపిడీ!