ఫాగింగ్‌.. పరేషాన్‌! | - | Sakshi
Sakshi News home page

ఫాగింగ్‌.. పరేషాన్‌!

Aug 19 2025 8:09 AM | Updated on Aug 19 2025 8:09 AM

ఫాగిం

ఫాగింగ్‌.. పరేషాన్‌!

దోమకాటుకు పల్లెలు విలవిల

మూలనపడిన యంత్రాలు

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

దౌల్తాబాద్‌: దోమకాటుతో గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణకు గత ప్రభుత్వ హయాంలో వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫాగింగ్‌ మిషన్లు చాలా పంచాయతీల్లో చెడిపోగా.. మరికొన్నింటిలో మిషన్లు మాయమయ్యాయి. దోమకాటుకు పల్లెవాసులు విలవిలలాడుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌తో పాటు ఇతర వైరల్‌ జ్వరాలు తాండవం చేస్తున్నాయి. దోమల నివారణకు కొనుగోలు చేసిన యంత్రాలు పంచాయతీల్లో లేకపోవడం గమనార్హం. అప్పటి ప్రభుత్వం ఒక్కో యంత్రానికి రూ.35వేల నుంచి రూ.40వేలు వెచ్చించి కొనుగోలు చేసింది. కొన్ని గ్రామాల్లో మేజర్‌ పంచాయతీల నుంచి అడపాదడపా తీసుకుని పారిశుద్ధ్య కార్మికులు ఫాగింగ్‌ చేస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో యంత్రాలు మాయం కావడంతో పక్కన పంచాయతీల నుంచి తీసుకురావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇటీవల స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఫాగింగ్‌ యంత్రాలకు మరమ్మతులు చేయించాలని అధికారులు సూచనలు చేస్తున్నప్పటికీ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. డీజిల్‌, పెట్రోలు, లిక్విడ్‌లను సమ పద్ధతుల్లో వినియోగించకపోవడంతో యంత్రాలు చెడిపోయినట్లు తెలుస్తోంది.

ఖర్చు తడిసి మోపెడు

మండలంలోని చాలా గ్రామాల్లో ఫాగింగ్‌ యంత్రాలు మరమ్మతులు చేయించలేక మూలన పడేశారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. చెడిపోయిన యంత్రాలకు మరమ్మతులు చేయించాలంటే చాలా ఖర్చులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దోమల స్వైరవిహారం

గ్రామ పంచాయతీల్లో వారంలో రెండుసార్లు ఫాగింగ్‌ చేపట్టాల్సి ఉంటుంది. వర్షాకాలం సీజన్‌ ప్రారంభంలో వీటి వినియోగం మరింత ఎక్కువ చేసినప్పుడే దోమలను సగం వరకు నియంత్రణ చేయవచ్చు. గ్రామం మొత్తంగా నెలలో ఒక్కసారి కూడా ఫాగింగ్‌ చేయడం లేదు. ఒకసారి పిచికారీ చేసిన ఫొటోలనే ప్రతి నెలా వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గ్రామాల్లో ఫాగింగ్‌ చేపట్టకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.

ఆదేశాలు జారీ చేశాం

ప్రతి గ్రామంలో దోమల నివారణ కోసం మందును పిచికారీ చేయాలని కార్యదర్శులకు సూచనలు చేశాం. కొన్ని గ్రామాల్లో ఫాగింగ్‌ మిషన్లు పాడైనట్లు తెలిసింది. వాటిని మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటాం. వ్యాధుల తీవ్రత దృష్ట్యా పారిశుద్ధ్య నిర్వహణకు నిరంతరం పర్యవేక్షించేలా కృషి చేస్తాం.

– శ్రీనివాస్‌, ఎంపీడీఓ, దౌల్తాబాద్‌

ఫాగింగ్‌.. పరేషాన్‌! 1
1/1

ఫాగింగ్‌.. పరేషాన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement