
రహదారులకు మరమ్మతులు చేయిస్తాం
కుల్కచర్ల: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామీణ రోడ్లు పాడయ్యాయని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామానికి వెళ్లే మెటల్ రోడ్డు వర్షానికి దెబ్బతిని గుంత ఏర్పడింది. దీంతో ఏఈ మణికుమార్, పంచాయతీ కార్యదర్శి మైమున బేగంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాడైన రోడ్లను పరిశీలించి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నామని, ఆయన అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మండలంలో ఎక్కడ రోడ్లు పాడైన, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో నేతలు గోపాల్, సతీష్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు
ఇబ్రహీంపట్నం: చెక్ బౌన్స్ కేసులో నిందితుడైన భాస్కర్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఇబ్రహీంపట్నం ఎంఎం కోర్టు న్యాయమూర్తి సోమవారం తీర్పు వెలువర్చారు. న్యాయ వాది రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు దయానంద్‌కు రూ.24,87,500 చెల్లించాలని, అలాగే భాస్కర్ ఏడాది జైలు శిక్ష అనుభవించాలని తీర్చు చెప్పారన్నారు.
శంకర్‌పల్లి ఎంపీడీఓ భార్య ఆత్మహత్య
లాలాపేట: శంకర్‌పల్లి ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ భార్య ఉష(37) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఎంపీడీఓ వెంకయ్యగౌడ్ భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 4లోని హోమ్ సన్‌షైన్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కొద్ది రోజులుగా మానసిక వేదన అనుభవిస్తున్న ఉష ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన వెంకయ్యగౌడ్ ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ సాయంతో తలుపులు బద్ధలు కొట్టి, కిందకు దించగా అప్పటికే చనిపోయింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డిఫాల్టర్లు చెల్లిస్తేనే..
మేమూ కడుతాం
అబ్దుల్లాపూర్‌మెట్: రైతుల ముసుగులో కొందరు రైతుసేవా సహకార సంఘం నుంచి అధిక మొత్తంలో రుణాలు పొంది, చెల్లించడం లేదని.. డిఫాల్టర్లు చెల్లిస్తేనే తాము చెల్లిస్తామని రైతులు స్పష్టం చేశారు. రుణాలను త్వరగా చెల్లించాలని సంఘం అఽధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ.. సోమవారం మండల కేంద్రంలోని సంఘం కార్యాలయం ఎదుట మజీద్‌పూర్ గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సాగు చేయని వారికి పెద్దమొత్తంలో రుణాలు ఇచ్చి, వసూలు చేయకుండా కాలం గడుపుతారని, చిన్నమొత్తం రుణంగా ఇచ్చి చిన్న సన్నకారు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రుణాలు మంజూరు చేసి, డబ్బులు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. కొంత మంది 200 గజాల ప్లాటు తప్పుడు పత్రాలు పెట్టి, బ్యాంకులో రుణాలు పొందారని పేర్కొన్నారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకొని రుణాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రుణాలు పొంది సాగు చేయకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి, రూ. కోట్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తొలుత అలాంటి వారి నుంచి రుణం వసూలు చేయాలని సూచించారు.
రాజకీయ లబ్ధికోసమే
భూ ధారాదత్తం
బడంగ్‌పేట్: పేదలు సాగుచేసుకుంటున్న భూములను గత ప్రభుత్వం లాక్కొని.. రాజకీయ లబ్ధికోసం, ఓట్ల కోసం క్రైస్తవులకు దారాదత్తం చేసిందని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొద్రమోని పురుషోత్తం ఆరోపించారు. సోమవారం కార్పొరేషన్ పరిధి కుర్మల్‌గూడలో జి.కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల భూములను నాటి బీఆర్‌ఎస్ సర్కార్ బలవంతంగా గుంజుకుందని విమర్శించారు. కుర్మల్‌గూడలో ఇళ్లులేని ఎంతో మంది పేదలు ఉన్నారని, వారికి 60 గజాలు కేటాయించడానికి మనస్సు రాని బీఆర్‌ఎస్.. క్రైస్తవుల మెప్పు పొందడానికి వారి సమాధులకు ఎకరాల కొద్దీ స్థలాన్ని ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. ఆ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇళ్లు లేని పేదలకు పంపిణీ చేయాలని కోరారు.