
నీళ్లపల్లి.. భక్తజనం ప్రణమిల్లి
● వైభవంగా ఏకాంబరి రామలింగేశ్వరుడి ఉత్సవాలు
● సప్తకొలనులలో భక్తుల పుణ్యస్నానాలు
బషీరాబాద్: జడివానలోనూ ఏకాంబరి రామలింగేశ్వరస్వామి జాతరకు భక్తజనం పోటెత్తారు. మండలంలోని నీళ్లపల్లి అటవీ ప్రాంతంలోని సప్తకొలనులలో వెలసిన స్వామి వారి దర్శనం కోసం సోమవారం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రల సరిహద్దు గ్రామాల నుంచి వనాన్ని లెక్కచేయకుండా భక్తులు భారీగా కదిలి వచ్చారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన రామలింగేశ్వరుడి ఆలయం చుట్టు ఉన్న సప్త కొలనులలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. తాండూరు, మహబూబ్‌నగర్ పట్టణాలతో పాటు కర్ణాటకలోని సేడం తాలుకా నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు నడపడంతో వేలల్లో భక్తులు దర్శించుకున్నారని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
యాకూబ్‌సాబ్ దర్గాకు పూజలు
రామలింగేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం భక్తులు కొలనులోని యాకూబ్‌సాబ్ దర్గాను దర్శించుకున్నారు. పూలు, పండ్లు పెట్టి మొక్కు తీర్చుకున్నారు. అలాగే ముస్లిం భక్తులు కూడా అధిక సంఖ్యలో హాజరై దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
వైభవంగా రథోత్సవం
స్వామి వారి రథాన్ని ఆలయ ధర్మకర్తల మండలి రకరకాల పూలతో అందంగా అలంకరించారు. రథంపై ఉత్సవమూర్తిని ఉంచి భక్తులు వీధుల గుండా ఊరేగించారు. ఈ జాతరకు ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలు హాజరు కావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతరలో మిఠాయి దుకాణాలు, ఆటబొమ్మల దుకాణాలు, గాజుల దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి.
చీఫ్ విప్, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
నీళ్లపల్లి ఏకాంబర రామలింగేశ్వర స్వామిని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి వేరువేరుగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కరణం పురుషోత్తం రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్, నాయకులు సుధాకర్‌రెడ్డి, రుక్మారెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

నీళ్లపల్లి.. భక్తజనం ప్రణమిల్లి