
శ్రావణమాసం.. పూజలు ప్రత్యేకం
తాండూరు టౌన్: చివరి శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని శ్రీభావిగి భద్రేశ్వర స్వామి దేవస్థానంలోని శివాలయంలో పరమశివుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రాయచోటి పట్టణంలో వెలసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
దౌల్తాబాద్‌లో ఊరేగింపు
దౌల్తాబాద్: మండలంలోని ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో సోమవారం శ్రావణమాస ముగింపు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దౌల్తాబాద్‌లోని నీలకంఠస్వామి ఆలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకం, పల్లకీసేవ చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమం చేశారు.
జినుగుర్తిలో మండలి చీఫ్ విప్..
తాండూరు రూరల్: మండల పరిధిలోని జినుగుర్తి గ్రామ శివారులో ఉన్న శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద శ్రావణమాసం చివరి సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ధర్మకర్తలు కరమ్‌చందు, ఉత్తమ్‌చందు, మోహన్‌దాస్, రఘుకిషోర్, అనంతయ్య, జగదాంబ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి దర్శించుకొని పూజలు చేశారు.
ఘనంగా జాతర
మోమిన్‌పేట: శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో రాళ్లగుడుపల్లి పరిధిలోని రామలింగేశ్వర స్వామి జాతర ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి మొదలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం భక్తులు లెక్క చేయకుండా స్వామివారి అభిషేకంలో మునిగి తేలారు.
అంబు రామేశ్వరంలో పూజలు
తాండూరు రూరల్: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులోని పెద్దేముల్ మండలం తట్టెపల్లి–పాషాపూర్ గ్రామ సమీపంలో ఉన్న అంబు రామేశ్వరస్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో భక్తులు ఉపవాసం దీక్షలు విరమించారు. అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్‌కుమార్‌తో పాటు పలువురు స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రావణమాసం.. పూజలు ప్రత్యేకం