
ఓపెన్ వర్సిటీలో ఉపాధి అవకాశాలు
కొడంగల్ రూరల్: సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఓపెన్ వర్సిటీ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థులకు ఆర్‌ఏఎస్‌సీఐ(రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కమర్షియల్ ఆఫ్ ఇండియా) వారితో ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశం కల్పిస్తున్నట్లు, మహిళలకు ఉమెన్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. పాలిటెక్నిక్, ఐటిఐ, ఓపెన్ ఇంటర్ పాసైనవారు ఈ నెల 30వ తేదీలోపు అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. దివ్యాంగులకు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత విద్య నందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఓపెన్ వర్సిటీకి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్స్‌పాల్, ఓపెన్ వర్సిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.