
ఆదమరిస్తే అంతే..
● రోడ్డు మధ్యలో గోతులు
● ప్రమాదపుటంచుల్లో పర్యాటకుల ప్రయాణం
● నిధులు లేక నీరసించిన పనులు
ధారూరు: నిత్యం వేలాదిమంది పర్యాటకులు కోట్‌పల్లి జలాశయానికి రాకపోకలు సాగించే మార్గం అధ్వానంగా తయారయింది. ప్రస్తుత వర్షాలతో పలు చోట్ల భారీగా గోతులు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. ధారూరు మండలం రుద్రారం గ్రామం దాటిన తరువాత రెండో కల్వర్టు వద్ద గోతులు ఏర్పడ్డాయి. కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. వాహనాలు దెబ్బ తింటున్నాయి. ఇలా మరమ్మతుకు గురైన వాహనాలను ఘటనా స్థలం రోడ్డు పక్కనే వదిలి వెళ్తుండడంతో మరిన్ని ప్రమాదాలకు దారి తీస్తుందని, ఏదైనా భారీ నష్టం జరగముందే తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. అయినప్పటికీ.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి కారణం నిధుల లేమి అని తెలుస్తోంది. ఇప్పటికై నా ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి, గుంతలు, ధ్వంసం అయిన చోట మరమ్మతులు చేయించాలని వాహనదారులు, పర్యాటకులు కోరారు.