
మహిళా సాధికారతకు కృషి
నవాబుపేట: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నా రు. శనివారం మండలంలోని చించల్‌పేట్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తో కలిసి ప్రారంభించారు. గ్రామంలో రూ.15 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని, రూ.20 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్‌ను, రూ.20 లక్షలతో పశు వైద్య ఉపకేంద్ర భవనాన్ని, రూ.20 లక్షలతో నిర్మించిన డ్వాక్రా భవనం, రూ.30 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.20 లక్షలతో పీహెచ్‌సీ భవనం, రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణా లు, క్యాంటీన్లు ఏర్పాటు చేస్తోందన్నారు. మహిళా సంఘాలకు రూ.26 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. మరో రూ.800 కోట్ల వడ్డీ లేకుండా ఇవ్వడం జరిగిందన్నారు. గృహలక్ష్మి పేరిట 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యాం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. చించల్‌పేట్ గ్రామంలో పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. మండలి చీఫ్‌విప్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్‌డీఓ వాసుచంద్ర, డీఆర్‌డీఏ శ్రీనివాస్, డీపీఓ జయసుధ, టీటీడబ్ల్యూఓ కమలాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాజరత్నం, పశుసంవర్ధక శాఖ అధికారి సదానందం, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ ఉమేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రామ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.