
సీపీఐ మాటే తూటా
తాండూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని సమద్ ఫంక్షన్ హాల్‌లో పార్టీ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో స్నేహం కొనసాగుతుందన్నారు. అయినా ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని పేర్కొ న్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని అనలేమని తెలిపారు. ప్రజల ఆకలి బాధలు తీర్చేందుకు నిరంతరం పని చేస్తామన్నారు. ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టులేనని అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో అంటరానితనం పోవాలనే నినాదంతో పోరాటం చేశామని తెలిపారు. పార్టీ అనుబఽంధ కార్మిక సంఘాల ద్వారా కార్మికుల పక్షాన తాము గళం వినిపిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్‌లను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలు, మున్సిపల్ కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. విద్య రంగ సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పాలని ఆ సంఘం నాయకులు సాంబశివరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పస్య పద్మ, జిల్లా కార్యదర్శులు విజయలక్ష్మి పండిత్, సీపీఐ నాయకులు గోపాల్‌రెడ్డి, పీర్ మహ్మద్, వెంకటేశ్, రవీందర్, సురేష్‌కుమార్, బషీర్ హైమద్, మునీర్ హైమద్, అబ్దుల్‌ల్లా, జగదాంబ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.