
భూమి విరాసత్ చేయడం లేదని..
కుల్కచర్ల: వారసత్వంగా వచ్చిన భూమిని విరాసత్ చేయకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం కుల్కచర్ల తహసీల్ కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఘనపూర్ గ్రామానికి చెందిన కామునిపల్లి రాములుకు కుల్కచర్ల రెవెన్యూ సర్వేనంబర్ 626/6, 626/1లో ఎనిమిదెకరాల ప్రభుత్వ భూమి ఉంది. 2019లో రాములు మృతి చెందగా, అప్పటి నుంచి భూమిని విరాసత్ చేసుకోలేదు. తన తండ్రి పేరున ఉన్న భూమిని తల్లి నర్సమ్మ పేరున మార్చాలని కోరుతూ 2025 జూన్ 23న బాధితుడు నందకిషోర్ అధికారులను కలిశాడు. దస్త్రాలను పరిశీలించిన అధికారులు మీరు కాస్తులో లేరని చెప్పాడన్నారు. ఈ విషయమై తాము కోర్టును ఆశ్రయించగా ఆర్డర్ కాపీ ఇచ్చిందని తెలిపాడు. న్యాయస్థానం ఆర్డర్ కాపీతో వెళ్లి తమ భూమిని విరాసత్ చేయాలని కోరినా.. అధికారులు పట్టించుకోలేదని వాపోయాడు. దీంతో మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అక్కడున్న వారు గమనించి పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పారు. ఈ విషయంపై తహసీల్దార్ మనోహర్ చక్రవర్తిని వివరణ కోరగా.. బాధిత రైతు సర్వేనంబర్ పీఓటీ కింద కేసు నమోదై ఉందన్నారు. దీంతో దరఖాస్తును ఆర్డీఓకు పంపించామని తెలిపారు.
ఒంటపై పెట్రోల్ పోసుకుని
యువకుడి ఆత్మహత్యాయత్నం
కుల్కచర్ల తహసీల్ కార్యాలయం ఎదుట ఘటన

భూమి విరాసత్ చేయడం లేదని..